తొలకరి పలకరింత
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:01 AM
నగరంలో గురువారం ఉదయం ఎట్టకేలకు మంచి వర్షం కురిసింది.
నగరంలో తెల్లవారుజాము నుంచే వర్షం
చల్లబడిన వాతావరణం
పద్మనాభంలో 32 మి.మీ. నమోదు
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గురువారం ఉదయం ఎట్టకేలకు మంచి వర్షం కురిసింది. కొద్దిరోజులుగా శివారు ప్రాంతాల్లో వర్షం పడుతున్నా నగరంలో ఉండడం లేదు. అయితే గురువారం తెల్లవారుజాము నుంచి నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, పిడుగులు ప్రారంభం కావడంతో నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా తుళ్లిపడి లేచారు. కొద్దిసేపటికి ఈదురుగాలులతో వర్షం మొదలైంది. దాదాపు గంటకుపైగా ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆ తరువాత కూడా పది, పదకొండు గంటల వరకూ అడపాదడపా జల్లులు పడ్డాయి. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కొద్దిరోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. సాయంత్రం వరకు మేఘాలు ఉండడంతో వాతావరణం చల్లబడింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్మనాభంలో 32, బక్కన్నపాలెంలో 31, పెందుర్తిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఎండ కొనసాగుతుందని, కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.