Share News

మహా దోపిడీ

ABN , Publish Date - May 26 , 2026 | 12:43 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.

మహా దోపిడీ

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి హవా

అధికారులకు, జీవీఎంసీకి చెందిన వాహనాలకు పెట్రోల్‌/డీజిల్‌ కేటాయింపు, బిల్లు చెల్లింపుల్లో చేతివాటం

పదేళ్లుగా ఒకచోట విధులు

అక్రమ సంపాదనతో ఏకంగా పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు?

ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమిస్తున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. అధికారుల వాహనాలతోపాటు నగర పాలక సంస్థకు చెందిన వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ కేటాయింపు, బంకులకు బిల్లుల చెల్లింపుల వ్యవహారాలను చూసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి (సూపర్‌వైజర్‌) ఒకరు అవినీతి సంపాదనతో ఏకంగా ఒక పెట్రోల్‌ బంకునే ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీ అధికారులకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు 35 వరకూ ఉన్నాయి. వాటితోపాటు చెత్త తరలింపునకు వినియోగించే వాహనాలు, రోడ్లు శుభ్రం చేసే వాహనాలు, గెడ్డల్లో పూడికతీసే యంత్రాలకు జీవీఎంసీయే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తుంది. అందుకు జోన్‌ల వారీగా బంకుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుంది. అధికారుల స్థాయిని బట్టి ఒక్కో వాహనానికి నెలకు 50 నుంచి వంద లీటర్లు వరకు పెట్రోల్‌/డీజిల్‌ సరఫరా చేస్తారు. అలాగే జీవీఎంసీకి చెందిన లారీలు, టిప్పర్లు, వ్యాన్‌లు, జేసీబీలు, బాబ్‌కాట్‌లు, ఫాగింగ్‌ యంత్రాలకు నిర్దేశించిన కోటా మేరకు ప్రతి నెలా డీజిల్‌ సరఫరా చేస్తుంటారు. ఒప్పందం కుదుర్చుకున్న పెట్రోల్‌ బంకులు నెల ముగిసిన తర్వాత ఏ వాహనానికి ఎంత పెట్రోల్‌/డీజిల్‌ ఇచ్చాయనే వివరాలు, ఇతర ఆధారాలతో కూడిన బిల్లును జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో అందజేస్తాయి. ఇలా ఆరు నెలలకు ఒకసారి రూ.కోటి చొప్పున పెట్రోల్‌బంకులకు జీవీఎంసీ చెల్లింపులు జరుపుతుంది. జీవీఎంసీ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ కేటాయింపు, బంకులకు బిల్లులు చెల్లింపు వ్యవహారాలను చూసి ఉన్నతాధికారులకు నివేదించేందుకు పదేళ్ల కిందట ఒక అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని నియమించారు. సూపర్‌వైజర్‌ హోదాలో పనిచేసే సదరు ఉద్యోగి పెట్రోల్‌ బంకుల నుంచి వచ్చిన బిల్లులు, ఇతర వివరాల ఆధారంగా వారికి జీవీఎంసీ చెల్లింపులు జరిపేలా బిల్లు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపిస్తుంటారు. జీవీఎంసీకి చెందిన అధికారులు తమకు కేటాయించిన డీజిల్‌/పెట్రోల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుంటారు. ఇకపోతే జీవీఎంసీకి చెందిన యంత్రాలు, లారీలు, ఫాగింగ్‌ యంత్రాల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)ను కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది. డీజిల్‌/పెట్రోల్‌ జీవీఎంసీ సరఫరా చేస్తే డ్రైవర్‌, ఇతర సిబ్బందిని కాంట్రాక్టర్‌ నియమించుకుని నగర పాలక సంస్థ సూచించిన పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మోసానికి తెరలేస్తోందని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలోని సిబ్బందితోపాటు కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఓ అండ్‌ ఎం దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ వాహనాలను ఒప్పందం ప్రకారం తిప్పకుండా తక్కువ ట్రిప్పులు వేయడం చేస్తుంటారు. కానీ జీవీఎంసీకి చెప్పే లెక్కల్లో మాత్రం తాము ఒప్పందం ప్రకారమే వాహనాలను నడిపినట్టు చూపిస్తుంటారు. ఈ విషయాన్ని మెకానికల్‌ విభాగంలో డీజిల్‌/పెట్రోల్‌ కేటాయింపుల వ్యవహారాలను చూస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌ ఎప్పుడో పసిగట్టి, తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సదరు కాంట్రాక్టర్లతో అవగాహన కుదుర్చుకుని బంకుల సిబ్బందితో మాట్లాడి పూర్తిస్థాయిలో డీజిల్‌ సరఫరా చేసినట్టు రశీదులు తీసుకుని జీవీఎంసీకి బిల్లు పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంపాదించిన సొమ్ముతో తన సోదరి పేరుతో శొంఠ్యాం సమీపంలో ఒక పెట్రోల్‌ బంకు పెట్టినట్టు సమాచారం. జీవీఎంసీలో పెట్రోల్‌, డీజిల్‌ కేటాయింపుల్లో అక్రమాలకు తనకు సహకరించే బయాలజిస్ట్‌ కార్యాలయంలో పనిచేసే మరొక ఉద్యోగిని తన పెట్రోల్‌ బంకులో భాగస్వామిగా పెట్టుకున్నట్టు మెకానికల్‌ విభాగంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులకు కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అక్కడి నుంచి వేరొకచోటకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో సదరు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకోవడంతోపాటు డీజిల్‌, పెట్రోల్‌ బిల్లులు చెల్లింపుల్లో అక్రమాలపై దృష్టిసారించే అవకాశం ఉందని ఆ విభాగం సిబ్బంది పేర్కొంటున్నారు.

Updated Date - May 26 , 2026 | 12:43 AM