దారి చూపిన సర్కారు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:58 AM
ఎట్టకేలకు మండలంలోని అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారులకు మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపనలకే పరిమితమైన ఈ రెండు రహదారులకు కూటమి ప్రభుత్వం రూ.4.35 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
- రూ.4.35 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
- రాయపురాజుపేట, పీ ఎస్‌పేట- జన్నవరం రహదారులకు మోక్షం
- గత వైసీపీ ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితం
చోడవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మండలంలోని అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారులకు మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపనలకే పరిమితమైన ఈ రెండు రహదారులకు కూటమి ప్రభుత్వం రూ.4.35 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
నియోజకవర్గ కేంద్రంలోని కొత్తూరు జంక్షన్ నుంచి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలను కలిపే ప్రధానమైన పీఎస్‌పేట- జన్నవరం రహదారి కొన్నేళ్లుగా అధ్వానంగా ఉండడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఎస్ పేట- జన్నవరం రోడ్డు పనులకు రూ.2.83 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఆ తరువాత ఈ రోడ్డు పనులకు గ్రాంటే లేదని తెలియడంతో రహదారి పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కన్నంపాలెం నుంచి జన్నవరం జంక్షన్ వరకు తారురోడ్డు వేసిన నాటి పాలకులు జన్నవరం నుంచి పీఎస్‌పేట వరకు రోడ్డు పనులను పూర్తి చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చోడవరం- కొత్తూరు జంక్షన్ నుంచి కిలోమీటరు దూరం సీసీ రోడ్డును ఉపాధి నిధులతో నిర్మించింది. మిలట్రీనాయుడు కళ్లాల నుంచి పీఎస్ పేట, ఆపై పీ ఎస్ పేట నుంచి జన్నవరం జంక్షన్ వరకు గల రహదారి అభివృద్ధికి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో పీఎస్ పేట రోడ్డుకు రూ.2.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోడ్డు పూర్తయితే మండలంలోని జన్నవరం,చాకిపల్లి, కన్నంపాలెం, తిమ్మనపాలెం, బెన్నవోలు పంచాయతీలతో పాటు బుచ్చెయ్యపేట, రావికమతం, అనకాపల్లి ప్రాంతాలకు కూడా ప్రజల రాకపోకలకు ఇబ్బంది తొలగిపోతాయి.
రాయపురాజుపేట- అంభేరుపురం రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు
వైసీపీ పాలనలో శిలాఫలకానికే పరిమితమైన మండలంలో ప్రఽధానమైన అంభేరుపురం- రాయపురాజుపేట రహదారి పనులకు తాజాగా రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారి పూర్తిగా పాడైపోయి వాహనాల రాకపోకలకు కూడా వీలులేని విధంగా తయారైంది. తుప్పలు, డొంకలతో రహదారి మూసుకుపోయి స్థానికులు అష్టకష్టాలు పడుతున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నియోజకవర్గ కేంద్రంలోని ప్రధానమైన ఈ రెండు ర హదారులకు నిధులు మంజూరు కావడంతో వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.