సాధారణ ప్రసవాలకు కేరాఫ్ ఘోషాస్పత్రి
ABN , Publish Date - May 20 , 2026 | 12:24 AM
కొన్నేళ్లుగా సిజేరియన్ ప్రసవాలు పెరుగుతూ వస్తున్నాయి.
గత ఏడాది మొత్తం 4,337 ప్రసవాలు
అందులో సాధారణ ప్రసవాలు 2,417, సిజేరియన్ 1,820
అత్యవసరమైతే తప్ప సిజేరియన్ ప్రసవాలు చేయని వైద్యులు
ఈ కారణంతో గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన గర్భిణుల చేరిక
ఆస్పత్రి అందిస్తున్న సేవలకు ‘ఐఎస్‌ఓ’ సర్టిఫికెట్
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
కొన్నేళ్లుగా సిజేరియన్ ప్రసవాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే మరింత ఎక్కువయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రసవాల కోసం నిరీక్షించి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే గర్భిణి కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేమన్న ఉద్దేశంతో సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. అయితే, నగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి (ఘోషస్పత్రి) వైద్యులు మాత్రం పూర్తిగా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సిజేరియన్ చేయడం లేదు. ఈ ఆస్పత్రి సాధారణ ప్రసవాలకు ఇస్తున్న ప్రాధాన్యం, రోగుల భద్రత, రికార్డుల నిర్వహణ, నాణ్యమైన సేవలు వంటి అంశాల్లో మెరుగైన ప్రమాణాలను పాటిస్తున్నందుకు హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం అనే ఇంటర్నేషనల్ సంస్థ ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. ఈ గుర్తింపు ఆస్పత్రిలో అందిస్తున్న సేవలకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
భారీగా రోగులు..
ఘోష ఆస్పత్రికి ప్రతిరోజూ 250 నుంచి 300 మంది గర్భిణులు వస్తుంటారు. ఇన్‌పేషెంట్ సామర్థ్యం 177 అయినప్పటికీ భారీ సంఖ్యలో వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా 250 పడకలను ఏర్పాటుచేసి అడ్మిషన్స్ వస్తున్నారు. ప్రతిరోజూ 20 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో 14 నుంచి 16 వరకు సాధారణ ప్రసవాలు ఉంటాయి. ఆస్పత్రిలో నలుగురు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 25 మంది పీజీలు, 91 మంది నర్సింగ్ సిబ్బంది, ఒక పీడియాట్రీషియన్, ఒక ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రికి నగరంతోపాటు అరకులోయ, పాడేరు, అనకాపల్లి, విజయనగరం, ఒడిశా వంటి ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తుంటారు.
ఆస్పత్రిలో 2024లో 5,093 ప్రసవాలు జరగ్గా, వీటిలో సాధారణ ప్రసవాలు 2,890, సిజేరియన్ ప్రసవాలు 2203. అలాగే, గడిచిన ఏడాది (2025లో) 4,337 ప్రసవాలు నిర్వహించగా, ఇందులో 2,517 సాధారణ ప్రసవాలు, 1,820 సిజేరియన్లు నిర్వహించారు.
వీలైనంత వరకు సాధారణ ప్రసవానికే మొగ్గు
- డాక్టర్ ఉషా ప్రసాద్, ఘోష ఆస్పత్రి సూపరింటెండెంట్
ఆస్పత్రిలో వైద్యులంతా సాధారణ ప్రసవాలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప సిజేరియన్ చేయరు. అవసరమైతే గర్భిణిని రెండు, మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచి మరీ సాధారణ ప్రసవం చేయిస్తున్నాం. సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణితోపాటు కుటుంబ సభ్యులకు వివరిస్తున్నాం. ఒకవేళ సిజేరియన్ చేయాల్సి వస్తే దానికి కారణాన్ని సవివరంగా తెలియజేయడం వల్ల సంతృప్తిగా ఉంటున్నారు.