గిరిజనుల వికాసమే కూటమి ధ్యేయం
ABN , Publish Date - May 29 , 2026 | 10:43 PM
గిరిజనుల వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
గిరిజనులకు ఉచితంగా సోలార్ రూప్‌టాప్‌లు
జన్‌మన్‌లో తాగునీరు, రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
పాడేరు, మే 29 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇక్కడ నిర్వహించిన ’పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్- 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.4,497 కోట్లు కేటాయిస్తే.. తమ కూటమి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించిందన్నారు. దేశ వ్యాప్తంగా 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో స్కూల్‌కు సగటున రూ.30 కోట్లు వ్యయం చేసిందన్నారు. ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో వెనుకబడిన ఆదిమజాతి గిరిజనుల పల్లెల్లో తాగునీరు, రోడ్లు, విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేస్తుందన్నారు. అందరూ నాయకత్వ పటిమను పెంచుకోవాలని, కార్యకర్తలను తరం నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు అన్ని రంగాల్లోనూ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు స్థానిక బీజేపీ నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, కార్యక్రమం ఇన్‌చార్జి పెనుమాక రవికుమార్, జిల్లా ఇన్‌చార్జి పుట్ట గంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు నందోలి ఉమామహేశ్వరరావు, డొంబునాయుడు, పోలవరం జిల్లా అధ్యక్షుడు బుల్లి కొండలుదొర, ఇతర నాయకులు కెజియారాణి, పాంగి మత్స్యకొండబాబు, గోపాలపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.