Share News

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:01 AM

అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు.

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యం
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కె.నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి

పాడేరులో పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి లిఖిత పూర్వకంగా అభిప్రాయాల సేకరణ

పాడేరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాలులో బుధవారం నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశాన్ని పరిశీలకుడు కొణిదెల నాగబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లుగా అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పార్టీ కోసం అనేక మంది జనసైనికులు, వీర మహిళలు పని చేస్తున్నారని, ఈ క్రమంలో వారి అర్హతకు అనువైన పదవులు కల్పించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పార్టీ అధిష్ఠానం ఏర్పాటు చేసిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ద్వారా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేది, పార్టీలో ఎవరెవరు ఎటువంటి పదవులను ఆశిస్తున్నారనే దానిపై లిఖితపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అరకులోయ పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు.

డబల్‌ ఇంజన్‌ సర్కారుతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

కూటమి ప్రభుత్వం డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ప్రధానంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, ఏజెన్సీలో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజన హక్కులు, రాజ్యాంగ స్ఫూర్తి, చట్టాల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పవన్‌కల్యాణ్‌ దూరంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.200 కోట్లు వ్యయం చేస్తే, తమ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు వ్యయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, పార్టీ నిర్మాణ సారథులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 01:01 AM