Share News

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:10 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ హెచ్చరిక

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 255 వినతుల స్వీకరణ

ముంచంగిపుట్టు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను నిర్వహించారు. మండలంలోని 23 పంచాయతీల పరిధిలో గల పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అధికారులకు అర్జీలు సమర్పించారు. వివిధ సమస్యలపై మొత్తం 255 అర్జీలను జేసీ, ఐటీడీఏ పీవోలు స్వీకరించారు. ముఖ్యంగా రహదారులు, తాగునీరు, విద్యుత్‌, వైద్యం, సాగునీరు, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను అందజేశారు. భూ వివాదం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం, సీసీ, బీటీ రోడ్లు ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, రేషన్‌ కార్డులు, తల్లికివందనం పథకం వంటి సమస్యలను అర్జీదారులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జేసీ శ్రీపూజ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడి సమస్యలను పరిశీలించాలని, మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు సమాచారం అందించాలని సూచించారు. పరిష్కారం సాధ్యం కాని అంశాలపై కారణాలను స్పష్టంగా వివరించాలన్నారు. అర్జీలను గడువులోగా పరిష్కరించకపోవడం, అర్జీదారులతో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్లే పిటిషన్లు పదేపదే పునరావృతమవుతున్నాయని, అలా జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ను మండల స్థాయిలో నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ రావలసి ఉంది. అయితే పాడేరులో అత్యవసర సమావేశం ఉండడంతో రాలేకపోయారు. నేరుగా కలెక్టర్‌కు సమస్యలను చెప్పుకుందామని వచ్చిన పలువురు నిరాశ చెందారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, ముంచంగిపుట్టు స్పెషల్‌ ఆఫీసర్‌ వి.మోహన్‌రావు, ఎంపీడీవో ధర్మారావు, జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:10 AM