శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:35 AM
ప్రజల చెంతకే పాలన అందించడం, శాంతి భద్రతలను కాపాడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పోలీసు అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఇందుకోసం పోలీసు అధికారులు కృషి చేయాలి
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశం
నేరాలపై సమీక్షా సమావేశం
తగ్గిన గంజాయి, మహిళలపై నేరాలు
పెరిగిన సైబర్ క్రైమ్, సోషల్ మీడియా అపరాధాలు
అనకాపల్లి రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రజల చెంతకే పాలన అందించడం, శాంతి భద్రతలను కాపాడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పోలీసు అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆమె ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఎస్పీ తుహిన్‌సిన్హా జిల్లాలో నేరాల వివరాలు, కేసుల పురోగతి, గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, 2024-25తో పోల్చితే 2025-26లో జిల్లాలో పలు విభాగాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. 2024 జూలై ఒకటి నుంచి 2025 జూన్ 30 వరకు మహిళలపై నేరాలకు సంబంధించి 606 కేసులు నమోదు కాగా, 2025 జూలై ఒకటి నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు 567 కేసులు నమోదై ఏడు శాతం తగ్గుదల కనిపించిందన్నారు. 2024-25లో 180 గంజాయి కేసులు నమోదు కాగా 2025-26లో 111 కేసులతో 38.33 శాతం తగ్గుదల నమోదైందన్నారు. అయితే సైబర్ నేరాలు 26.8 శాతం, సోషల్ మీడియా అపరాధాలు 65 శాతం పెరిగినట్టు ఆమె తెలిపారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టి తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఆమె తెలిపారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 24 ప్రదేశాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి ఆయా ప్రదేశాల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీలు పోతురెడ్డి శ్రీనివాసరావు, జీఆర్‌ఆర్ మోహన్, బి.మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.