Share News

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:05 PM

అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై శుక్రవారం జిల్లాలోని ప్రతి సచివాలయంలో గ్రామసభలు నిర్వహించనున్నారు.

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
పాడేరు మండలం మినుములూరు సచివాలయంలో గురువారం కుటుంబ సర్వే వివరాలు ప్రదర్శించిన సిబ్బంది

ఏకీకృత కుటుంబ సర్వేపై నేడు సచివాలయాల్లో గ్రామసభలు

24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

సర్వేలో భాగంగా ప్రత్యేక యాప్‌తో ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధ వివరాలు నమోదు

దాని ఆధారంగా అర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు

జిల్లాలో లక్షా 96 వేల 199 కుటుంబాలు

6 లక్షల 56 వేల 805 మంది జనాభా

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై శుక్రవారం జిల్లాలోని ప్రతి సచివాలయంలో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇంటింటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి ఏకీకృత కుటుంబ సర్వే చేశారు. వాటికి సంబంధించిన వివరాలను గురువారం ప్రతి సచివాలయంలోనూ ప్రదర్శించారు. శుక్రవారం సచివాలయాల స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, నమోదైన కుటుంబాలకు సంబంధించిన సమాచారంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. వాటిపై ఎవరికైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేయాల్సినవి ఉంటే శుక్రవారం(19వ తేదీ) నుంచి 24వ తేదీ వరకు ఫిర్యాదులు/వినతులు స్వీకరిస్తారు. ఈ క్రమంలో ప్రజలు తమకు సంబంధించిన కుటుంబ వివరాలు సక్రమంగా ఉన్నాయో?, లేదో? అనేది స్వయం తెలుసుకునేందుకు గ్రామసభలకు హాజరుకావడంతో పాటు తమ వివరాలను పరిశీలించుకోవడం అవసరమని డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆధార్‌ నంబర్‌ ఆధారంగా వివరాల నమోదు

ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వేను చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన మండల, సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చింది. గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబలోని వ్యక్తుల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధ వివరాల సేకరించి, అందుకు రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. అలాగే ప్రతి కుటుంబంలోని వ్యక్తి ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. విద్యార్హత, వివాహ స్థితి, తండ్రి/భర్త పేరు, కులం, మతం వంటి సామాజిక వివరాల నమోదు చేశారు. విద్యావంతులైతే ఎంత వరకు చదువుకున్నారు?, నైపుణ్య శిక్షణలు ఏమైనా పొందారా/పొందుతారా?, స్వయం ఉపాధి, నెలవారీ ఆదాయం, సీజనల్‌గా వలస వెళతారా?, ఇల్లు స్థితిగతులు, ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు, వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ తదితర 38 రకాల వివరాలను నమోదు చేసి, వ్యక్తుల ఈకేవైసీ చేశారు. జిల్లాలో 11 మండలాల్లో లక్షా 96 వేల 199 కుటుంబాలకు సర్వే చేశారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 79 వేల 569 మంది జనాభా ఉండగా, అత్యల్పంగా అనంతగిరి మండలంలో 50 వేల 954 మంది జనాభా ఉన్నారు. ఏకీకృత కుటుంబ సర్వే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అసలైన అర్హులను గుర్తించేందుకు కీలకంగా దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.

జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వేలో నమోదైన వివరాలు

----------------------------------------------------------------------------------------------

వ.సం మండలం సచివాలయాలు.. సర్వేలో నమోదైన కుటుంబాలు.. జనాభా

----------------------------------------------------------------------------------------------

1. అనంతగిరి 21 15,320 50,954

2. ముంచంగిపుట్టు 18 15,732 55,649

3. డుంబ్రిగుడ 16 15,771 56,834

4. పెదబయలు 16 16,959 61,489

5. అరకులోయ 18 17,409 59,618

6. జి.మాడుగుల 18 17,827 59,565

7. కొయ్యూరు 23 17,883 52,119

8. హుకుంపేట 26 18,091 61,198

9. పాడేరు 16 18,270 56,456

10. జీకేవీధి 18 19,341 63,354

11. చింతపల్లి 22 23,596 79,569

-----------------------------------------------------------------------------------------------

మొత్తం 212 1,96,199 6,56,805

-----------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 18 , 2026 | 11:05 PM