Share News

సప్లిమెంటరీలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ABN , Publish Date - May 17 , 2026 | 10:14 PM

గిరిజన ప్రాంతంలో పతో తరగతి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వివిధ పాఠ్యాంశాల్లో స్వల్ప మార్కుల తేడాతో పరీక్షలు తప్పిన విద్యార్థులందరూ పాస్‌ అయ్యేలా ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లోనూ బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల శిబిరాల్లో బోధన, విద్యార్థుల హాజరును ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు. ఈనెల 4న ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ఈనెల 24తో ముగియనున్నాయి.

సప్లిమెంటరీలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
చింతపల్లి బాలూర ఆశ్రమ పాఠశాలలో పది తప్పిన విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు

టెన్త్‌ తప్పిన విద్యార్థులకు పక్కాగా ప్రత్యేక తరగతులు

హాజరుకాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి టీచర్లు కౌన్సెలింగ్‌

కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష

చింతపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 మండలాల్లో 2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను 7,261 మంది రాశారు. ఏప్రిల్‌ 30వ తేదీన విడుదలైన ఫలితాల్లో 3,355 మంది విద్యార్థులు పాస్‌కాగా, 3,906 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అత్యల్పంగా 46.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ గిరిజన ప్రాంతంలో పాఠశాలలను స్వయంగా సందర్శించి విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. కొంత మంది విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నప్పటికీ పలు పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత ఏవిధంగా సాధిస్తున్నారని ఆరా తీశారు. పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అవుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌ రెండేళ్లుగా పది పరీక్షలను కఠింనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్తీర్ణత శాతం తగ్గినా పది పరీక్షలు పక్కాగా జరగాలని ప్రతీ పరీక్ష కేంద్రంలో నాన్‌ డిపార్టుమెంట్‌ అధికారులను సిటింగ్‌ స్క్వాడ్‌లుగా నియమించారు. దీంతో రెండేళ్లుగా ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది.

ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా..

సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధన చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిషత్‌, ఉన్నత పాఠశాలల్లోనూ ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నారు. టెన్త్‌ తప్పిన విద్యార్థులకు సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు కాలమానం ప్రకారం బోధన చేస్తూ, ముఖ్యమైన ప్రశ్నలకు విద్యార్థులతో జవాబులు రాయిస్తున్నారు. దీంతో విద్యార్థి కచ్చితంగా ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రత్యేక తరగతుల శిబిరాలను స్థానిక కోర్సు డైరెక్టర్‌, ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థుల్లో పెరిగిన ఆసక్తి

ప్రత్యేక తరగతులకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రతి పాఠశాలలో 95శాతం మంది విద్యార్థులు ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నారు. హాజరుకాని మిగిలిన ఐదు శాతం విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేసి తిరిగి పాఠశాలకు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ, విద్యాశాఖ టెన్త్‌ విద్యార్థుల ప్రగతి కోసం చేపడుతున్న ప్రత్యేక శిక్షణ తరగతులపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 17 , 2026 | 10:14 PM