Share News

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:22 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని అరకు పార్లమెంట్‌ పరిధిలోని కూటమి నాయకులకు మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. చిత్రంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీష, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి, తదితరులు

అరకు పార్లమెంట్‌ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల దిశానిర్దేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని అరకు పార్లమెంట్‌ పరిధిలోని కూటమి నాయకులకు మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కీలక సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల సన్నద్ధత, తదితర అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి, క్షేత్రస్థాయి నుంచి సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య మనస్పర్థలకు తావులేకుండా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కేడర్‌కు నాయకులు సూచించారు. ఎవరికి అవకాశం లభించినా మిగిలిన ఆశావహులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని మంత్రులు సూచించారు. మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు మోజురు తేజోవతి, ఎమ్మెల్యేలు విజయ్‌చంద్ర బోనెల, మిరియాల శిరీష, జయకృష్ణ, నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, పడాల భూదేవి, కిడారి శ్రావణ్‌కుమార్‌, గిడ్డి ఈశ్వరి, దాడి రత్నాకర్‌, పేరాబత్తుల రాజశేఖర్‌, వి.గంగులయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:22 AM