విద్యా, వికాసమే లక్ష్యంగా..
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:34 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున పీఎం శ్రీ పథకంతో జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల రూపురేఖలు మారాయి. వికసిత్ భారత్‌లో భాగంగా సమగ్ర శిక్ష విభాగం అధికారులు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో 23 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి, రూ.6.24 కోట్లతో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టారు.
పీఎం శ్రీతో హైస్కూళ్ల అభివృద్ధి
జిల్లాలో 23 ఉన్నత పాఠశాలలు ఎంపిక
రూ.6.24 కోట్లతో అభివృద్ధి పనులు
ఒక్కో పాఠశాలలో ఒక్కొక్క
ప్రాధాన్యత అంశంపై అభివృద్ధి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
‘ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (పీఎంశ్రీ) పేరిట జాతీయ విద్యావిధానం-2020ని అమలుపరుస్తూ గుణాత్మక విద్య, అభ్యాసన ఫలితాలు మెరుగుపరిచారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో జీకేవీధి మండలంలో రెండు ఉన్నత పాఠశాలలు, మిగిలిన 21 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 23 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో అవసరాన్ని బట్టి కెమిస్ట్రీ ల్యాబ్, ఆట స్థలం, కిచెక్ గార్డెన్, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్లను మెరుగుపరిచారు. ఆయా ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, రసాయనిక బోధన, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులు ఒక లక్ష్యంతో చక్కని ఫలితాలు వైపు పయనిస్తారనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలివే..
‘ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ పేరిట ఉమ్మడి జిల్లాలోని 23 ఉన్నత పాఠశాలలను సమగ్ర శిక్ష అధికారులు ఎంపిక చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పాడేరు మండలంలో తలారిసింగి ఆశ్రమ ఉన్నత పాఠశాల, అడ్డతీగల గురుకులం, అనంతగిరి మండలంలో చిలకలగెడ్డ, అరకులోయ మండలంలో రవ్వలగుడ ఆశ్రమ పాఠశాల, చింతపల్లి ఆశ్రమ పాఠశాల, చింతూరు మండలంలో నరసింహాపురం, దేవిపట్నం మండలంలో ఇందుకూరుపేట, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాల, జీకే వీధి మండలంలో రింతాడ, జీకేవీధి ఆశ్రమ పాఠశాలలు, జి.మాడుగుల గురుకులం, గంగవరం ఆశ్రమ పాఠశాల, హుకుంపేట మండలం పెదగరువు ఆశ్రమ పాఠశాల, కొయ్యూరు ఆశ్రమ పాఠశాల, కూనవరం గురుకులం, మారేడుమిల్లి గురుకులం, ముంచంగిపుట్టు ఆశ్రమ పాఠశాల, ఎటపాక మండలంలో లక్ష్మీదేవిపేట స్కూల్, పెదబయలు గురుకులం, రాజవొమ్మంగి మండలం దూసరిపాము, రంపచోడవరం గురుకులం, వీఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాల, వై.రామవరం మండలం కోట పాఠశాలను ఎంపిక చేశారు.
పీఎంశ్రీలో చేపట్టిన అభివృద్ధి పనులు
-ఒక్కో పాఠశాలకు రూ.15.58 లక్షలతో 14 హైస్కూళ్లలో కెమిసీ్ట్ర ల్యాబ్‌లు
-15 హైస్కూళ్లలో రూ.5 లక్షలతో క్రీడా మైదానాలు
-రూ.32.5 లక్షలతో 13 హైస్కూళ్లలో కిచెక్ గార్డెన్లు
-రూ.46.2 లక్షలతో 2 హైస్కూళ్లలో గ్రంఽథాలయ భవనాలు
-రూ.23.1 లక్షలతో ఒక హైస్కూల్‌లో సైన్స్ ల్యాబ్
-రూ.2.3 కోట్లతో 23 పాఠశాలకు ర్యాంప్‌లు, మరుగుదొడ్ల అభివృద్ధి