క్షయ రహిత జిల్లాయే లక్ష్యం
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:46 AM
జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ తిరుమానిశ్రీపూజ అన్నారు. స్థానిక ఎన్‌ఆర్ శంకర న్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘క్షయ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
- జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ
పాడేరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ తిరుమానిశ్రీపూజ అన్నారు. స్థానిక ఎన్‌ఆర్ శంకర న్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘క్షయ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా యంత్రాంగం, యువత సమన్వయంతో జిల్లాను క్షయ రహితం చేయడానికి కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో టీబీపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, జోష్ టీమ్‌ల పేరిట యువతను భాగస్వాములను చేస్తూ పలు అవగాహన కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రజలకు క్షయపై సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు. క్షయ సోకితే బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. వైద్యులను సంప్రదించి ఆరు నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. అనంతరం అతిథులు, తదితరులతో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్ క్షయ రహిత ప్రతిజ్ఞ చేయించారు. క్షయ రహిత ప్రచారంలో యువతను భాగస్వాములను చేసే జోష్ టీమ్ ఫొటో స్టాండ్‌లో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రియాజ్‌బేగ్, జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.