గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:21 AM
గంజాయిని శాశ్వతంగా నిర్మూలించి, జిల్లాను గంజాయి రహితం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
ఎస్‌పీతో కలిసి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం
పాడేరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గంజాయిని శాశ్వతంగా నిర్మూలించి, జిల్లాను గంజాయి రహితం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం గంజాయి నిర్మూలనపై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి ప్రభావం ఉన్న ప్రాంతాలపై అధికారులకు సమగ్ర సమాచారం ఉండాలని, జిల్లాలో గంజాయి సాగు చేసేందుకు అవకాశం లేకుండా చూడాలన్నారు. గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అందుకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. గిరిజనుల్ని గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. అలాగే డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో, ఇతర విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలపై ప్రణాళికాబద్ధ్దంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి వ్యసన విమోచన కేంద్రాల్లో చేర్పించి, అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. గంజాయి సాగును వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన పథకాలు, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, వాళ్లు సమాజంలో గౌరవప్రదంగా జీవనం సాగించేలా చూడాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యువతకు అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆయన సూచించారు. ఎస్‌పీ అమిత్‌బర్ధార్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి వ్యవహారాల్లో సంబంధాలున్న వారి బంధువులపైనా తాము నిఘా పెట్టామన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని, గంజాయి స్మగ్లర్లకు, అపరిచిత వ్యక్తులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచిస్తున్నామని చెప్పారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు, తనిఖీలు, ప్రతి చోటా పటిష్ఠ నిఘా పెట్టామన్నారు. ప్రజలు గంజాయి సంబంధ చట్టవ్యతిరేక వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఎస్‌పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా గ్రామీణాభివృద్ధికి సంస్ధ పీడీ వి.మురళి, జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, ఎల్‌డీఎం మాతునాయుడు, ఈగల్, అటవీ, వెలుగు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.