గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:49 AM
జిల్లాను సంపూర్ణంగా గంజాయి రహితం చేయాలని పోలీసు అధికారులను ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశించారు.
- పోలీసు అధికారులకు ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాను సంపూర్ణంగా గంజాయి రహితం చేయాలని పోలీసు అధికారులను ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశించారు. తన కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ, పొరుగున ఉన్న ఒడిశా నుంచి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతున్నదని, దానిని పూర్తిగా అరికట్టాలన్నారు. అలాగే ఆకస్మికంగా వాహన తనిఖీలు, పూర్వపు గంజాయి స్మగ్లర్లపై నిఘా వంటివి మరింత పటిష్టంగా చేపట్టాలన్నారు. విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ రహదారిపై వాహన ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజలకు పోలీసులు సేవలు పక్కాగా అందించడంతోపాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు ఆయా మోసాలకు గురికాకుండా అప్రమత్తం చేయాలన్నారు.
పాడేరులో గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ
పాడేరులో గంజాయికి వ్యతిరేకంగా పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్‌పీ వై.శృతి మాట్లాడుతూ జిల్లాను గంజాయి రహితం చేసేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు తమకు సహకరించాలన్నారు. అలాగే గంజాయి రవాణాపై నిఘా పెట్టామని, ప్రజలు గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబఽంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్: 1972 కు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై టోల్ ఫ్రీ నంబర్: 1930కు సమాచారం అందించాలని, జిల్లాలో గంజాయి, నేర నియంత్రణకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు, చింతపల్లి, రంపచోడవరం డీఎస్‌పీలు వి.రాజసింహారెడ్డి, సీహెచ్ తిరుపతిరావు, అష్రఫ్ అలీ, స్థానిక సీఐ ఎస్.రామారావు, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.