Share News

గంజాయి రహిత ఏపీ ధ్యేయం

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:20 AM

రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించడం ద్వారా గంజాయి రహిత ఏపీగా నిలపడమే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగల్‌) ఆకే రవికృష్ణ అన్నారు.

గంజాయి రహిత ఏపీ ధ్యేయం

ఈగల్‌ ఐజీ రవికృష్ణ

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించడం ద్వారా గంజాయి రహిత ఏపీగా నిలపడమే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగల్‌) ఆకే రవికృష్ణ అన్నారు. విశాఖలోని ఈగల్‌ ప్రాంతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును జీరోస్థాయికి తగ్గించే లక్ష్యంతో ‘పల్లెబాట’ పేరుతో సోమవారం నుంచి ఆగస్టు 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు.

విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల సరిహద్దుల్లో గిరిజనప్రాంతమైన కొత్తవలసలో కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టామన్నారు. గిరిజన రైతులతో ముఖాముఖీ మాట్లాడి వారి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేందుకు ‘ఆపరేషన్‌ చైతన్యం’ పేరుతో అవగాహన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. శాటిలైట్‌ మ్యాపింగ్‌, హై రిజల్యూషన్‌ డ్రోన్‌ సర్వేల ద్వారా గంజాయిసాగును గుర్తించి వందలాదిమంది సిబ్బందితో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి గంజాయితోటలను ధ్వసం చేస్తున్నామన్నారు. గంజాయిసాగుకు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నామని, 25వేల మంది గిరిజన రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి, 35వేల ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటల సాగుకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశామన్నారు. ఒడిశాలోని కటాఫ్‌ ఏరియాల నుంచి అక్రమ రవాణా జరుగుతోందని, ఇది ఈగల్‌ విభాగానికి సవాల్‌గా మారిందన్నారు. గంజాయి నెట్‌వర్క్‌ను వెనకుండి నడిపిస్తూ రూ.కోట్లు గడించిన అంతర్రాష్ట్ర కింగ్‌పిన్‌లను, ఆర్థికంగా సహకరించే వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదుచేస్తున్నామన్నారు. ఆస్తులు, వాహనాలను, బ్యాంక్‌ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నామన్నారు. గంజాయిపై టోల్‌ఫ్రీ నంబరు 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి సమావేశంలో ఈగల్‌ అదనపు ఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:20 AM