Share News

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:16 AM

ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతితో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, చిత్రంలో జేసీ టి.పూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఈవో భానుమూర్తిరాజు, ఏపీసీ స్వామినాయుడు, టీడబ్ల్యూ డీడీ పరిమిళ

విద్యాశాఖాధికారులు, టీచర్లకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతితో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. మిషన్‌ మార్చి- 2027 పేరిట పదవ తరగతి ఫలితాల సాధనపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చక్కని ఫలితాల సాధనకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు నిత్యం పరీక్షలు, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బోధన సాగించాలన్నారు. విద్యాశాఖాధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్ది టెన్త్‌లో ఆశించిన ఫలితాలు సాధించాలన్నారు. జిల్లాలో విద్యా ప్రగతి మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అందుకు గాను మరింత కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల ముఖ హాజరు 99 శాతం ఉండడాన్ని కలెక్టర్‌ అభినందించారు. ఇదే స్థాయిలో విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలని, ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలన్నారు. అలాగే 3 నుంచి 5 రోజులు పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల ఇళ్లకు హెచ్‌ఎంలు వెళ్లి వారిని తిరిగి పాఠశాలల్లోకి రప్పించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యా బోధనకు సంబంధించిన అంశాలను అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా చక్కని ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సాహించే పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళ, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ శశికుమార్‌, ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యాశాఖపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌

జిల్లా విద్యాశాఖకు సంబంఽధించిన అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వసతి సదుపాయాలు, తదితర విషయాలను కలెక్టర్‌ టి.నిషాంతి వివరించారు. ప్రధానంగా విద్యాలయాలకు సంబంధించిన భవనాల నిర్మాణం, నిధుల వ్యయం, పురోగతిపై ప్రధాన కార్యదర్శి శ్యామలరావు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:16 AM