Share News

గుబులు పుట్టిస్తున్న ఘాట్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:20 PM

ఇన్నాళ్లు పాడేరు ఘాట్‌లో కొండచరియలో.. చెట్టు కొమ్మలో విరిగిపడతాయని డ్రైవర్లు, ప్రయాణికులు భయపడేవారు. కాని గత కొన్నాళ్లుగా అందుకు భిన్నంగా భారీ వాహనాల రాకపోకలు సాగిస్తే చాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అనుకోని విధంగా మలుపుల వద్ద భారీ వాహనాలు అడ్డంగా నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది.

గుబులు పుట్టిస్తున్న ఘాట్‌
ఘాట్‌లో ఓ మలుపులో రోడ్డుకు మధ్యలో ఆగిన భారీ లారీ

నిత్యం ఆగిపోతున్న భారీ వాహనాలు

ఇబ్బందులకు గురవుతున్న

ప్రయాణికులు, వాహన చోదకులు

పట్టించుకోని రవాణా, పోలీస్‌ శాఖలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ఇన్నాళ్లు పాడేరు ఘాట్‌లో కొండచరియలో.. చెట్టు కొమ్మలో విరిగిపడతాయని డ్రైవర్లు, ప్రయాణికులు భయపడేవారు. కాని గత కొన్నాళ్లుగా అందుకు భిన్నంగా భారీ వాహనాల రాకపోకలు సాగిస్తే చాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అనుకోని విధంగా మలుపుల వద్ద భారీ వాహనాలు అడ్డంగా నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. మైదాన ప్రాంతం నుంచి శనివారం ఏజెన్సీకి రాళ్ల పిక్కల లోడుతో వస్తున్న భారీ లారీ వంట్లమామిడికి సమీపంలో ఓ మలుపు వద్ద రోడ్డుకడ్డంగా ఆగిపోవడంతో సుమారు రెండు గంటలపాటు ఏజెన్సీకి, మైదాన ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో నిత్యం ఘాట్‌లో ఇదే దుస్థితి ఏర్పడుతుండడంతో బస్సుల్లోని ప్రయాణికులు, కార్లు, జీపుల డ్రైవర్లు భారీ వాహనాలంటే భయపడుతున్నారు. ఎక్కువగా రాజాపురం, వంట్లమామిడి గ్రామాలకు సమీపంలో, ఏసుప్రభు బొమ్మ మలుపు, కోమాలమ్మపనుకు మలుపు, గరికబందకు సమీపంలోనే భారీ వాహనాలు ఘాట్‌ ఎక్కలేక మార్గ మధ్యలో ఆగిపోతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు అడవిలో జాగరణ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రధానంగా రాత్రులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినపుడు ప్రయాణికులు పాట్లు వర్ణించలేం. అయితే తరచూ ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు, చిన్నవాహనాల డ్రైవర్లు అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే.. ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 25 కిలోమీటర్లు ఘాట్‌ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంలో పోల్చితే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్‌ మార్గంలో నిత్యం వాహనాలతో రద్దీగానే ఉంటుంది. ఈ తరుణంలో గంట సమయం రాకపోకలకు అంతరాయం ఏర్పడినా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఘాట్‌ నిబంధనలు పాటించని భారీ వాహనాలు

స్థానిక ఘాట్‌లో భారీ వాహనాలు రాకపోకలు సాగించకూడదనే నిబంధన మచ్చుకైనా అమలు కావడం లేదు. గతంలో సిమెంట్‌ రేకులు, సిమెంట్‌ బస్తాలతో వచ్చే వాహనాలను గరికబంద జీసీసీ చెక్‌గేటు వద్ద నిలుపుదల చేసి, అక్కడ నుంచి ఆయా సరుకులను మినీ వ్యాన్లలో లోడ్‌ చేసి ఘాట్‌ మీదుగా ఏజెన్సీకి తరలించేవారు. అయితే గత కొన్నాళ్లుగా అలా చేయకుండా ఆయా సరుకులతో ఉన్న భారీ లారీలు సైతం ఘాట్‌లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో ఆయా లారీలు మరమ్మతులకు గురై మలుపుల వద్ద ఆగిపోతున్న సందర్భాల్లో ఇతర వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అలాగే ఆయా లారీలు సైతం మోటారు చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌ లోడ్‌తో ఘాట్‌లోని రాకపోకలు సాగించే క్రమంలో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే దీనిపై రవాణా, పోలీసు అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రతి రోజూ ఏదో ఒక మలుపులో ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదని బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:20 PM