Share News

ప్రశ్నార్థకంగా బాలారం జడ్పీ హైస్కూల్‌ భవిష్యత్తు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:20 PM

రెండు దశాబ్దాల క్రితం బాలారంలో నెలకొల్పిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత రెండేళ్లుగా హైస్కూల్‌లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో హైస్కూల్‌ని యూపీ స్కూల్‌గా మార్పు అయ్యే అవకాశం ఉంది.

ప్రశ్నార్థకంగా బాలారం జడ్పీ హైస్కూల్‌ భవిష్యత్తు
బాలారం జిల్లాపరిషత్‌ హైస్కూల్‌

రెండేళ్లుగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వలలో పడిన తల్లిదండ్రులు

యూపీ స్కూల్‌ స్థాయికి దిగజారనున్న హైస్కూల్‌

బీసీ హాస్టల్‌ పెడితే పెరగనున్న విద్యార్థుల సంఖ్య

కొయ్యూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆరు పంచాయతీలకు చెందిన 40 గ్రామాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాలారంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 200 మంది దాటి విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించడం, నిర్వహణకు అన్ని మౌలిక వసతులను కల్పించింది. అన్ని తరగతి గదులలో డిజిటల్‌ విద్యాభ్యాసానికి వీలుగా విద్యుత్‌ సదుపాయం, టీవీలు, తదితర అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దీనిని మోడల్‌ పాఠశాలగా మార్పు చేసి విద్యార్థుల సంఖ్య మరింత పెంచే యోచనతో 3వ తరగతి నుంచి విద్యాభ్యాసం చేసేలా మార్పు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుందని అంతా ఆశించారు. అయితే గడిచిన రెండేళ్ల నుంచి పాఠశాలలో ప్రవేశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక్కడి విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించేందుకు నర్సీపట్నంనకు చెందిన పలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పలు రాయితీలను తల్లిదండ్రులకు ఆఫర్‌ చేశాయి. దీంతో ఈ ఏడాది హైస్కూల్‌లో కేవలం 86 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరిలో 13 మంది ప్రాథమిక స్థాయికి చెందిన వారు కాగా మిగిలిన విద్యార్థులు ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఉన్నత పాఠశాల నిర్వహణకు నిబంధనల మేరకు 75 మంది విద్యార్థులు దాటి ప్రతి విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యనభ్యసించాలి. నిర్ధేశించిన విద్యార్థుల సంఖ్య తగ్గితే ఆ పాఠశాలను యూపీ స్కూలుగా పరిగణించి, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్యను తగ్గిస్తారు. ఈ నిబంధన మేరకు బాలారం జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల యూపీ పాఠశాలకు దిగజారే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య 13 నుంచి నలుగురుకే పరిమితమై పీజీ హెచ్‌ఎం పోస్టు రద్దవడంతోపాటు పాఠశాల నిర్వహణ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం చేతిలోకి వెళ్లిపోతుంది. అలాగే పర్యవేక్షణ డీఈవో నుంచి ఎంఈవో చేతుల్లోకి వెళుతుంది. ఇదే జరిగితే ఈ ఆరు పంచాయతీల పరిధిలోని 40 గ్రామాల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి నాతవరం మండలం చమ్మచింత, లేదా గొలుగొండ మండలం చోద్యం పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే.. గత రెండు విద్యా సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు యాజమాన్యాలు ఇస్తున్న ఆఫర్ల వలలో తల్లిదండ్రులు పడిపోతున్నారు. బాలారం నుంచి నర్సీపట్నానికి బస్సులో పిల్లలను ఉచితంగా తీసుకువెళుతున్నారు. ఫీజులో రాయితీలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఉదయం వెళ్లిన పిల్లలు రాత్రి ఏడు గంటల వరకు ఇళ్లకు వస్తుండడంతో తల్లిదండ్రులు పొలం, ఇతర పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండడంతో వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అయితే ఈ హైస్కూల్‌ పరిధిలో ఎక్కువగా వెనుకబడిన తరగతుల సామాజిక వర్గం వారు ఉన్నారు. ఈ హైస్కూల్‌లోనే బీసీ హాస్టల్‌ పెడితే ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:20 PM