ఇళ్ల లబ్ధిదారులకే నిధులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:24 AM
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందించే నిధులు పలు రాష్ట్రాలు దారిమళ్లిస్తున్నాయనే ఫిర్యాదులు అందడంతో ఇకనుంచీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకే జమ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది.
ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకు ఖాతాలకు జమ
కేంద్రం ఆదేశాలు
సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లలో అయోమయం
పనులకు వెనకడుగు
ఏం చేయాలో పాలుపోక హౌసింగ్ అధికారుల మల్లగుల్లాలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందించే నిధులు పలు రాష్ట్రాలు దారిమళ్లిస్తున్నాయనే ఫిర్యాదులు అందడంతో ఇకనుంచీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకే జమ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లలో అయోమయం నెలకొంది. ఇప్పటికే బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాకే అందితే, పనులు చేసినా ఇక్కట్లు తప్పవని భావిస్తున్నారు.
నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం 65 లేఅవుట్‌లు సిద్ధం చేసి లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలాలు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణాలను నిధులు అందుతాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఇళ్ల నిర్మాణాలపై తాజాగా కేంద్రం ఆంక్షలు విధించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచినిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేయాలని నిర్ణయించింది. దీంతో నగర శివారులో ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.
సాగుతున్న నిర్మాణాలు
నగర శివారులో వేసిన 65 లేఅవుట్‌లలో 1,40,798 మంది లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలాలు, 1,14,821 ఇళ్లు కేటాయించారు. తొలిదశలో 80,833 ఇళ్లు మంజూరుచేశారు. నగరానికి దూరం కావడంతో లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు వీలుగా లబ్ధిదారుడు, కాంట్రాక్టరు, సంబంధిత బ్యాంకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం నేరుగా నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు విడుదల చేస్తుంది. ఆ తరువాత లబ్ధిదారుని ఖాతాకు జమ చేసిన వెంటనే త్రైపాక్షిక ఒప్పందం మేరకు సంబంధిత కాంట్రాక్టర్ ఖాతాకు బదలాయిస్తున్నారు. ఇక ఇనుము, సిమెంట్, ఇసుక ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. అయినా మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు సగమే పూర్తయ్యాయి.
అరకొరగానే పనులు
తాజా సమాచారం మేరకు ఇప్పటివరకు 35,202 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. మిగిలిన 45,631 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో పునాదుల దశ వరకు సుమారు 25 వేలు ఉండగా, బేస్‌మెంట్ స్థాయిలో 12 వేలు, మిగిలినవి గోడలు, స్లాబ్ వరకు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి బిల్లులు పెండింగ్‌లో పడిపోవడంతో కాంట్రాక్టర్లు నాలుగైదు నెలలుగా పనులు చేయడం లేదు. గత నెలలో కొంతమేర బిల్లులు మంజూరుచేసినా నిర్మాణ పనుల్లోని కార్మికులకు అందకపోవడంతో వారంతా ఇప్పటికీ విధుల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల కాంట్రాక్టర్లు అధికారులకు హామీ ఇచ్చారు.
కాంట్రాక్టర్లలో అయోమయం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2021లో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో కేంద్రం పలుమార్లు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ వచ్చింది. చివరకు మొత్తం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికిగాను ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. నిర్మాణాలు పూర్తిచేసే సమయంలో దశలవారీగా బిల్లులు లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. గతంలో చేసిన పనులకు బిల్లుల కోసం నెలలు నిరీక్షించామని, ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాకు సొమ్ము జమ చేస్తే, అవి తమకు అందడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. ఈ నేపథ్యంలో పనులకు దూరంగాఉంటే మంచిదని పలువురు భావిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వస్తారా? ఒకవేళ రాకపోతే సెప్టెంబరు తరువాత నిధులు నిలిచిపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.