Share News

పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:17 PM

మన్యంలో పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చే గిరిజన రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం
రైతులకు పంపిణీ చేసేందుకు పట్టుపురుగుల విత్తనాలను సిద్ధం చేస్తున్న పట్టు పరిశ్రమ సిబ్బంది

మల్బరీ సాగు, పట్టు ఉత్పత్తికి సర్కారు తోడ్పాటు

మన్యంలో 500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారుల చర్యలు

గిరిజన రైతులకు 90 శాతం రాయితీలు, ప్రోత్సాహకాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చే గిరిజన రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పట్టు పరిశ్రమకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.

ఏజెన్సీలో గతంలో వందల ఎకరాల్లో ఉండే మల్బరీ సాగు, గత కొన్నాళ్లుగా ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో పదుల సంఖ్యకు దిగజారింది. కాగా ప్రభుత్వ ప్రోత్సాహంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పట్టుపరిశ్రమ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.

500 ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా చర్యలు

మన్యంలో గతంలో 500 ఎకరాల్లో మల్బరీ సాగు జరిగేది. కానీ అనివార్య కారణాలతో దిగజారింది. ఈ క్రమంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రానున్న మూడేళ్లలో 500 ఎకరాల్లో మల్బరీ సాగును చేపట్టాలనే లక్ష్యంతో గత రెండేళ్లుగా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఇప్పటికే 300 ఎకరాల్లో మల్బరీ సాగు పునరుద్ధరించగా, 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 170 ఎకరాలు లక్ష్యానికి 162 ఎకరాలకు చేరుకున్నారు. అలాగే 2026- 27 నాటికి ఏజెన్సీ వ్యాప్తంగా 500 ఎకరాలు పైబడి మల్బరీ సాగు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

పాడేరు కేంద్రంగా పట్టుగూళ్లు కొనుగోలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుగూళ్లు కొనుగోలులో పాడేరు ముందుండేది. ఇకపై అదే స్థాయిలో పట్టుగూళ్లు కొనుగోలుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మల్బరీ సాగు చేపట్టే రైతులకు రూ. 2లక్షల 92 వేలు విలువైన రేకుల షెడ్‌, మల్బరీ మొక్కలు నాటేందుకు రూ.27 వేలు, పురుగుల మందులు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అందజేయడంతో పాటు పట్టుపురుగులు పెంచే ట్రేలు, స్టాండ్‌కు రూ.23 వేలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. అలాగే పట్టుపురుగుల పెంపకం అనంతరం వాటి గూళ్లను సైతం నాణ్యత ఆధారంగా కిలో రూ.400 నుంచి రూ.600లకు పట్టుపరిశ్రమ శాఖాధికారులే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పట్టుగూళ్లను పాడేరులోని రీలింగ్‌ సెంటర్‌లోనే వాటిని ఉడికించి, పట్టుధారం తీస్తున్నారు. దీంతో పట్టుగూళ్లను ఉత్పత్తి చేసే గిరిజన రైతులకు గూళ్ల విక్రయానికి సంబంధించి మార్కెటింగ్‌ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తమ శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజన రైతులు లబ్ధిపొందాలని అధికారులు కోరుతున్నారు. .

సిబ్బంది కొరతతో పట్టుపరిశ్రమ శాఖ సతమతం

గిరిజన రైతులకు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చే పట్టుపరిశ్రమ శాఖను సిబ్బంది కొరత పట్టిపీడిస్తున్నది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మొదలుకుని వివిధ హోదాలతో పాటు వాచ్‌మన్‌ స్థాయి వరకు మొత్తం 75 మంది అధికారులు, సిబ్బంది ఉండాలి. కానీ కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. అందులోనూ క్షేత్ర స్థాయిలో రైతులతో పని చేసే సెరీకల్చర్‌ అధికారులు ఐదుగురికి గాను ఒక్కరే, అసిస్టెంట్‌ సెరీకల్చర్‌ అధికారులు ఆరుగురికి గాను ఒక్కరే ఉన్నారు. అలాగే టెక్నికల్‌ ఆఫీసర్లు 18 మందికి గాను ఒకరు, టెక్నికల్‌ అసిస్టెంట్లు 25 మందికి ముగ్గురు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు 13 మందికి గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో సిబ్బందిపై పనిభారంగా పెరిగింది. అయినప్పటికీ లక్ష్యం మేరకు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని, సంపూర్ణంగా సిబ్బంది ఉంటే మరింత వేగవంతం పనులు జరుగుతాయని వారంటున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:17 PM