ఏయూకు పూర్వవైభవం
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:23 AM
దేశంలో తొలితరం విద్యా సంస్థల్లో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్
శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
గొప్ప సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు వేదిక కావాలి
పూర్వ విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలని సూచన
పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన వీసీ
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):
దేశంలో తొలితరం విద్యా సంస్థల్లో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. శతాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలపై ఆయన శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఏయూ ఉపకులపతి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, వర్సిటీని ప్రపంచంలోనే గొప్ప సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా తీర్చిదిద్దేందుకు శతాబ్ది ఉత్సవాలు వేదిక కావాలన్నారు. దీనిలో భాగంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ వరకు పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతోపాటు వారిని శతాబ్ది ఉత్సవాల్లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఈ ఉత్సవాల్లో వర్సిటీ చరిత్ర ప్రతిబింబించాలన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఆయా కమిటీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మీడియా ద్వారా పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఆయా రంగాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలని, ప్రముఖులతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలన్నారు. వందేళ్ల విజన్‌కు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వర్సిటీలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఏప్రిల్ 26వ తేదీన శతాబ్ది స్థాపన దినోత్సవ అజెండాను వివరించారు. అనుబంధ కళాశాలలను ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యులను చేస్తామన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా భారీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పూర్వవిద్యార్థులను ఆహ్వానించి వారిని భాగస్వామ్యులను చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారితో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు. చదువుకున్న విద్యాలయానికి ఏదో ఒకటి చేయాలనే ఆశతో ఉన్న ప్రతి పూర్వ విద్యార్థిని ఉత్సవాల్లో భాగస్వామ్యం చేసి, వారి ద్వారా వర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకోవాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్సిటీలో చదువుకున్న వేలాది మంది అనేక రంగాల్లో స్థిరపడ్డారని పేర్కొంటూ ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణను అద్భుత అవకాశంగా తీసుకుని వర్సిటీని అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా వర్సిటీ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. సమీక్షలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఎ చైర్మన్ ఎం.ప్రణవ్‌గోపాల్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి, జీవీఎంసీ, వర్సిటీ, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ప్రజా దర్బార్
పార్టీ కార్యాలయంలో వినతిపత్రాల స్వీకరణ
సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని అర్జీదారులకు హామీ
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆ సమయంలో సమస్యలు వింటూ వారికి భరోసా ఇచ్చారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పూర్తిస్థాయి వేతన స్కేళ్లను వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పారు. పునరావాసం కల్పించాలని, పరిశ్రమల్లో ఉపాధి ఉపాధి కల్పించాలని అనకాపల్లి జిల్లా సీతపాలెం గ్రామస్థులు కోరారు. అనకాపల్లి లక్ష్మిదేవిపేటలోని శ్రీదుర్గాదేవి అమ్మవారి ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు. ఇటీవల ప్రతిపాదించిన ఫ్లైవోవర్ నిర్మాణం వల్ల ఆలయానికి భంగం కలగకుండా చూడాలని కోరారు. రజకుల సమస్యలపై రాష్ట్ర ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు రాజమండ్రి నారాయణ వినతిపత్రం అందజేశారు. ఏయూలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొద్దిరోజులుగా తాము ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా, వర్సిటీ అధికారులతో మాట్లాడతానని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ, తదితరులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. పింఛన్ల పంపిణీకి వెళ్లలేదా...అని వెలగపూడి, పట్టాభిని లోకేశ్ ప్రశ్నించగా ఉదయమే రెండు వార్డుల్లో పింఛన్లు పంపిణీ చేసి వచ్చామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేశ్ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.