అభ్యర్థులపై తుది నిర్ణయం అధినేతలదే...
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:09 AM
త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు కలిసి ముందుకు వెళతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు.
టీడీపీ పరిశీలకుడు ఎంఏ షరీఫ్
గ్రేటర్ ఎన్నికలపై కూటమి నేతలతో సమన్వయ సమావేశం
సమర్థులు, విజయావకాశాలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు వెల్లడి
120 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు కలిసి ముందుకు వెళతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో షరీఫ్ మాట్లాడుతూ మేయర్ అభ్యర్థి ఎంపిక, సీట్ల (120 వార్డులు) కేటాయింపుపై టీడీపీ, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు. సమర్థులు, విజయావకాశాలు, స్థానికంగా సామాజిక సమీకరణలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. గుర్తులు వేరైనా మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నియోజకవర్గ స్థాయిలో అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించేలా సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే 34 శాతం రిజర్వేషన్లు అమలుకాకుండా గొడ్డలి పార్టీ అడ్డుకోవాలని చూస్తున్నదని షరీఫ్ ఆరోపించారు.
దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి పార్టీ నేతలతో మొదటి సమావేశంలో అన్ని విషయాలపై చర్చించామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు పనిచేస్తాయన్నారు. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నేరవేర్చుతుందని, కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణుకుమారరాజు మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్‌గా, 120 డివిజన్‌లలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసేవారికి ముందుగా తన సంతాపం తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. మేయర్ అభ్యర్థిని మూడు పార్టీల పెద్దలు నిర్ణయిస్తారని, ఈ ఎన్నికల్లో 100 శాతం స్ర్టైక్ రేటు సాధిస్తామన్నారు. రెండున్నరేళ్ల పాలనకు జీవీఎంసీ ఎన్నికలు రిఫరెండంగా భావిస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికలు 100 శాతం జరిగి తీరుతాయని, ఈ విషయంలో అపోహలకు తావులేదని స్పష్టంచేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు లొడగల కృష్ణ, పసుపులేని ఉషాకిరణ్, వి.సతీష్‌కుమార్, పంచకర్ల సందీప్, పరశురామరాజు, సురేంద్రమోహన్ పాల్గొన్నారు.
షరీఫ్‌కు బయోడేటాలు అందజేసిన పల్లా, కృష్ణ
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి పార్టీల తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని గాజువాక ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు శనివారం జిల్లా పరిశీలకుడు ఎంఏ షరీఫ్‌కు బయోడేటా అందజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయ సమావేశం అనంతరం పలువురు షరీఫ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణలు బయోడేటాలు ఇచ్చి తమ పేర్లు పరిశీలించాలని కోరారు. ఇంకా పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, తదితరులు షరీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.