Share News

పండుగ...ఖర్చు దండిగా!

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:06 AM

సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారంతా మధుర స్మృతులను నెమరువేసుకుంటూ బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణమయ్యారు.

పండుగ...ఖర్చు దండిగా!

సంక్రాంతి సంబరాలకు భారీగా వెచ్చించిన యువకులు

విందులు, కోడిపందాలు...

ప్రత్యేకంగా పేకాట శిబిరాలు ఏర్పాటుచేసిన స్థానిక నాయకులు

స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆశావహుల ప్రత్యేక ఏర్పాట్లు

చాలామంది ఖాళీ జేబులతో తిరుగుముఖం

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారంతా మధుర స్మృతులను నెమరువేసుకుంటూ బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే కొందరు మాత్రం జేబులు ఖాళీ చేసుకున్నారు. ఊరిలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకూ కుటంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా గడిపిన యువకులు...అందుకోసం భారీమొత్తంలోనే ఖర్చు చేశారు. కొందరైతే ప్రత్యేకంగా పార్టీలు ఇచ్చారు. ఇందుకోసం కనీసం ఐదు వేల రూపాయల నుంచి పది వేల వరకూ ఖర్చు చేశారు. స్నేహితులు, బంధువర్గం ఎక్కువున్న వారికి ఇది మూడు నుంచి ఐదు రెట్లు అదనంగా ఉంది. మందు, విందు పార్టీలు పెద్దఎత్తున జరగడంతో గ్రామాలకు సమీపంలోని రెస్టారెంట్లు, రిసార్టులు, హోటల్స్‌ కళకళలాడాయి. ఈ ఖర్చును పండగ కోసం గ్రామాలకు వచ్చిన యువతే పెట్టుకున్నారు.

కోడి పందాలకు

గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో అనేకచోట్ల కోడి పందాలు నిర్వహించారు. ఈ పందాలకు వెళ్లిన చాలామంది యువకులు వేల రూపాయలు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు కోడి పందాలకు వెళ్లే యువత సంఖ్య తక్కువగా ఉండేది. అయితే, ఈసారి పందాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారాలు చేసే యువకులు, ఇతర ఉద్యోగాలు చేసేవారు భారీగా వెళ్లారు. దీంతో పందాలు జరిగిన చోట్ల ఖరీదైన కార్లు దర్శనమిచ్చాయి. నగరాలు, పట్నాల నుంచి వచ్చిన యువకులు కనీసం ఐదు వేల రూపాయల నుంచి రూ.50 వేల వరకూ పందాలు కట్టారు. ఆరుగురుం కలిసి రెండు కోళ్లు కొనుగోలు చేసి పందాలకు వెళ్లామని, రెండు పందాలు పోవడంతో రూ.80 వేలు నష్టపోయామని చెన్నైలో నిర్మాణ రంగ సంస్థలో ఇంజనీర్‌గా చేస్తున్న రాజేష్‌ అనే యువకుడు తెలిపాడు. ఇకపోతే, కోడి పందాల కోసం కొందరు యువకులు బృందాలుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లారు. అక్కడ పందాలు కాసి నష్టపోయారు.

పేకాట శిబిరాలు

పండుగకు వచ్చిన యువకుల కోసం అనేకచోట్ల ప్రత్యేకంగా పేకాట శిబిరాలను నిర్వహించారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అభ్యర్థులు ఈ శిబిరాలను ఏర్పాటు చేయించారు. ఫామ్‌హౌస్‌లు, ఖాళీగా ఉన్న ఇళ్లను ఇందుకు ఎంపిక చేశారు. వారే పోలీసు అధికారులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. గ్రామాలకు వచ్చిన యువత పేకాట శిబిరాల్లోనూ భారీగానే నష్టపోయారు. పండుగ నాలుగు రోజులు పేకాటలో రూ.35 వేలు నష్టపోయానని బెంగుళూరులో ఐటీ ఉద్యోగం చేసే వినయ్‌ రామ్‌ తెలిపాడు.

ఆర్థిక ఇబ్బందులు

కోడిపందాలు, పేకాట...అత్యధికులకు పండుగ సంతోషం లేకుండా చేశాయి. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంలో పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కొందరైతే బంధువులు, స్నేహితుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ మూడ్‌లో చేసిన ఖర్చులు తెలియలేదని, ఇప్పుడు వెనక్కి వెళుతుంటే అద్దెలు, పిల్లలు చదువులు, ఇతర ఖర్చులు తల్చుకుంటే భయమేస్తోందని హైదరాబాద్‌లో లిఫ్ట్‌ టెక్నీషియన్‌గా పనిచేసే రాజారావు పేర్కొన్నాడు. ఇదే పరిస్థితిని ఎంతోమంది ఎదుర్కొంటూ వెళుతుండడం గమనార్హం.

Updated Date - Jan 21 , 2026 | 01:06 AM