Share News

గెడ్డల ఉగ్రరూపం

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:36 AM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. బుధవారం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలంలోని జలవిహారి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

 గెడ్డల ఉగ్రరూపం
పెదబయలు మండలం పరదానిపుట్టు కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యం

భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవాహం

పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

అధికార యంత్రాంగం అప్రమత్తం

పాడేరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. బుధవారం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలంలోని జలవిహారి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, అరకులోయ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. గెడ్డలకు అవతల ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. గెడ్డలు పొంగుతున్న ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు దాటవద్దని అధికారులు కోరుతున్నారు.

హుకుంపేటలో...

హుకుంపేట: మండలంలో బుధవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో చీడిపుట్టు కాజ్‌వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని వల్ల అడ్డుమండ, చీడిపుట్టు, బారపల్లి సచివాలయాల పరిధిలోని ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే పెద్దగరువు, తడిగిరి, కామయ్యపేట, రాళ్లగెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలోని కాశీపట్నం వారపు సంత షెడ్లను సమీపంలో గల భారీ చింతచెట్టు బుధవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. ఇది అరకు- విశాఖ ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టు పడడంతో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. మండలంలోని వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భీంపోల్‌ లువ్వా గెడ్డ కల్వర్టును అనుకుని ప్రవహిస్తుండడంతో గుమ్మకోట, గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీలకు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గోస్తనీ, శారద, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని, అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. అరకు- విశాఖ ప్రధాన రహదారిలో బుధవారం ఉదయం చెట్టు విరిగిపడింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ కె.శంకరరావు ఘటనస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ మరోవైపు ఎక్స్‌కవేటర్‌ ద్వారా చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.

జీకేవీధిలో అత్యధికంగా 49.6 మిల్లీమీటర్లు...

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో బుధవారం కూడా భారీవర్షం కురిసింది. దీంతో జిల్లాలోని జీకేవీధి మండలంలో అత్యధికంగా 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ముంచంగిపుట్టులో 39.0, హుకుంపేటలో 34.2, పెదబయలులో 33.2, కొయ్యూరులో 32.4, పాడేరులో 32.2, జి.మాడుగులలో 32.0, డుంబ్రిగుడలో 25.6, అనంతగిరిలో 25.4, చింతపల్లిలో 22.0, అరకులోయ మండలంలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Sep 24 , 2026 | 12:36 AM