పెద్దేరు ఉగ్రరూపం
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:51 AM
మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నుంచి బుధవారం రాత్రి భారీ మొత్తంలో వరద నీటిని విడుదల చేయడంతోపాటు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో ఆ ప్రభావం చోడవరం మండలంలోని పలు గ్రామాలపై పడింది. గురువారం ఉదయం ప్రవాహం వరద ఉధృతి పెరగడంతో మండలంలోని గౌరీపట్నం సమీపంలోని గొర్లెవారి కల్లాల వద్ద నది గట్టుకు గండి పడింది.
చోడవరం మండలం గౌరీపట్నం, జన్నవరం వద్ద నది గట్టుకు గండ్లు
వేలాది ఎకరాల్లో నీట మునిగిన వరి పైరు
చోడవరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నుంచి బుధవారం రాత్రి భారీ మొత్తంలో వరద నీటిని విడుదల చేయడంతోపాటు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో ఆ ప్రభావం చోడవరం మండలంలోని పలు గ్రామాలపై పడింది. గురువారం ఉదయం ప్రవాహం వరద ఉధృతి పెరగడంతో మండలంలోని గౌరీపట్నం సమీపంలోని గొర్లెవారి కల్లాల వద్ద నది గట్టుకు గండి పడింది. దీంతో వరదనీరు బెన్నవోలు, శ్రీరాంపట్నం, అంకుపాలెం, పీఎస్‌పేట గ్రామాల్లోని పంటపొలాలను ముంచెత్తింది. మరికొద్దిసేపటికే జన్నవరం వద్ద నది గట్టుకు గండిపడడంతో జన్నవరం, కన్నంపాలెం, చాకిపల్లి ప్రాంతాల్లో పంటపొలాలు నీటమునిగాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కన్నంపాలెం-చాకిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జన్నవరం వంతెన వద్ద వరద ఉధృతి పెరిగిపోవడంతో సీఐ పి.అప్పలరాజు, ఎక్స్‌కవేటర్‌తో వంతెనకు అడ్డండగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వరద నీరు వంతెన పైనుంచి పారకుండా చర్యలు చేపట్టారు.
శారదా నది పరవళ్లు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు పెద్దేరు, కోనాం జాలాశయాల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో శారదానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. బుధవారం ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మెట్లు మునగగా, గురువారం ఉదయం వరద ఉధృతి మరింత పెరిగి, రేకుల షెడ్డులోకి ప్రవేశించింది. పట్టణానికి చెందిన పలువురు శారదా నగర్ వంతెనపైకి చేరుకొని నదిలో వరద పరవళ్లను తిలకించారు.