Share News

వాగుల ఉగ్రరూపం

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:36 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు ఉగ్ర రూపం దాల్చాయి. గత రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వాగుల ఉగ్రరూపం
హుకుంపేట మండలం మత్స్యగుండంలో వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

పాడేరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు ఉగ్ర రూపం దాల్చాయి. గత రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలంలోని జలవిహారి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, హుకుంపేటలోని చీడిపుట్టు గెడ్డ, అరకులోయ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. గెడ్డలకు అవతల ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. గెడ్డలు పొంగుతున్న ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు దాటవద్దని అధికారులు కోరుతున్నారు.

అనంతగిరిలో...

అనంతగిరి: మండలంలోని మారుమూల పెదకోట-కివర్ల మధ్యలో గల కుడియా కాజ్‌వే పైనుంచి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుకు అడ్డంగా తుప్పలను వేసి వాహన రాకపోకలను నిలిపివేశారు. అలాగే భీంపోల్‌ కాజ్‌వే పైనుంచి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నది. అక్కడ కూడా రాకపోకలను నిలిపివేశారు. దీంతో గుమ్మకోట-భీంపోల్‌ మార్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డముకు-నిమ్మలపాడు రోడ్డులోని డముకు సమీపంలో గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కాశీపట్నం గోస్తనీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రైవాడ, తాటిపూడి డ్యామ్‌ నిండుకుండలా ఉన్నాయి.

Updated Date - Oct 29 , 2026 | 12:36 AM