Share News

రైతుబజారు రెడీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:48 AM

నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన మోడల్‌ రైతుబజారు నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మొత్తం 72 దుకాణాలను షట్టర్లతో సహా నిర్మించారు. ఇది వినియోగంలోకి వస్తే ఇటు కూరగాయ రైతులకు, అటు వినియోగదారులకు మేలు చేకూరుతుంది.

రైతుబజారు రెడీ
చోడవరంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైతుబజార్‌

చోడవరంలో రూ.3 కోట్లతో నిర్మాణం

మొత్తం 72 దుకాణాలు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

కూరగాయ రైతులు, చిరువ్యాపారులకు తీరున్న కష్టాలు

రెండో దశలో మరిన్ని దుకాణాల నిర్మాణం

చోడవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన మోడల్‌ రైతుబజారు నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మొత్తం 72 దుకాణాలను షట్టర్లతో సహా నిర్మించారు. ఇది వినియోగంలోకి వస్తే ఇటు కూరగాయ రైతులకు, అటు వినియోగదారులకు మేలు చేకూరుతుంది.

చోడవరం పట్టణంలో ప్రేమసమాజం రోడ్డులోని పంచాయతీ స్థలంలో ఉన్న చిన్న బజారులో రైతులు, చిరువ్యాపారులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో, టీడీపీ గత హయాంలో రూ.3 కోట్ల వ్యయంతో రైతుబజారు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు శ్రీకారం చుట్టారు. నిర్మాణం చివరి దశలో ఉండగా ఎన్నికలు జరిగి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రైతుబజారుకు గ్రహణం పట్టింది. అప్పటి వరకు చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. ఐదేళ్లపాటు ఎటువంటి కదలికలేదు. దీంతో చోడవరం పరిసర గ్రామాలకు చెందిన కూరగాయల రైతులు, స్థానిక చిరువ్యాపారులు ఆంధ్రా బ్యాంకు రోడ్డు, ప్రేమసమాజం రోడ్డు, లక్ష్మీపురం రోడ్డు, ప్రభుత్వ కళాశాల, కొత్తూరు జంక్షన్‌, పీఎస్‌పేట రోడ్డు, దేవరాపల్లి రోడ్డు.. ఇలా పలుచోట్ల తమకు అనువుగా వుండే ప్రదేశంలో కూరగాయలు అమ్ముకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల రైతులు తీసుకువచ్చిన కూరగాయలు మొత్తం అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రైతుబజారు, కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరిపోసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రాజు, రైతుబజార్‌ను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టిసారించారు. కూరగాయలు, పూలు పండ్లు, మాంసాహార విక్రయాల కోసం వేర్వేరుగా దుకాణాలు నిర్మించారు. ఇక్కడ కూరగాయ రైతులతోపాటు స్థానిక చిరువ్యాపారులకు కూడా చోటు కల్పిస్తున్నారు. మొత్తం 72 దుకాణాలను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకన్నా ముందే ఇక్కడి దుకాణాలను లారీ విధానంలో కూరగాయ రైతులు, చిరువ్యాపారులకు కేటాయిస్తారు.

రెండో దశలో మరిన్ని దుకాణాలు

ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

రైతుబజారులో తొలి దశలో 72 దుకాణాలను అందుబాటులోకి తెస్తున్నాం, రెండో విడతలో రైతుబజారు పైభాగంలో మరిన్ని దుకాణాలు నిర్మించడంతోపాటు, చిన్నపాటి వ్యాపారులకు అద్దెకు ఇచ్చేలా చర్యలు చేపడతాం.

Updated Date - Mar 30 , 2026 | 12:48 AM