కబ్జాదారుల బరితెగింపు
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:50 AM
మండలంలోని పెద గొల్లలపాలెంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు గతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగా, కబ్జాదారులు వాటిని పీకిపడేశారు. అంతేకాక రెండు రోజుల నుంచి గ్రావెల్, మట్టి తీసుకువచ్చి ఆయా స్థలాలను ఎత్తు చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో పనుల జోరును పెంచేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
పదగొల్లలపాలెంలో గెడ్డవాగు ఆక్రమణ
గ్రావెల్, మట్టితో కప్పేస్తున్న అక్రమార్కులు
గతంలో కబ్జాను అడ్డుకొని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ సిబ్బంది
తాజాగా మళ్లీ ఆక్రమణకు తెరతీసిన వైనం
సబ్బవరం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద గొల్లలపాలెంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు గతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగా, కబ్జాదారులు వాటిని పీకిపడేశారు. అంతేకాక రెండు రోజుల నుంచి గ్రావెల్, మట్టి తీసుకువచ్చి ఆయా స్థలాలను ఎత్తు చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో పనుల జోరును పెంచేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
అసకపల్లి-దువ్వాడ ప్రధాన రహదారిలో పెదగొల్లలపాలెం గ్రామానికి అనుకొని సర్వే నంబరు 249లో సుమారు 70 సెంట్లలో గెడ్డవాగు ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ సెంటు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ధర పలుకుతున్నది. దీంతో గెడ్డవాగుపై కొంతమంది అక్రమార్కుల కన్నుపడింది. మూడేళ్లు క్రితం వైసీపీ హయాంలో గెడ్డవాగు స్థలాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఆక్రమించే ప్రయత్నం చేయగా అప్పటి అధికారులు అడ్డుకొని హెచ్చరిక బోర్డు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది ఆగస్టు, అక్టోబరు నెలల్లో ఆక్రమించి, స్థలం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం చేపట్టారు. స్థానికులు కొంతమంది తహశీల్దార్ బి.చిన్నికృష్ణకు ఇవ్వడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్‌ఐ వీరయ్య, వీఆర్వో దేముడుబాబు అక్కడకు వెళ్లి, పోలీసులు సహకారంతో గోడ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్‌తో ప్రహరీ గోడను కూల్చివేశారు. గెడ్డవాగు స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ స్థలాన్ని ఆక్రమించాలని పలుమార్లు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిపై తహశీల్దారు క్రిమినల్ కేసు పెట్టారు. అప్పటి నుంచి ఈ స్థలం జోలికి ఎవరూ వెళ్లలేదు. రెవెన్యూ సిబ్బంది కూడా ఇటువైపు రావడం మానేశారు. ఈ నేథప్యంలో రెండు రోజుల నుంచి గెడ్డవాగు ప్రభుత్వ భూమిని ఆక్రమించి, టిప్పర్లతో మట్టి, గ్రావెల్ తీసుకొచ్చి వాగును కప్పేస్తున్నారు. కబ్జాకు గురవుతున్న ఈ భూమి విలువ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని స్థానికులు చెబతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.