ఈవీ జోరు
ABN , Publish Date - May 24 , 2026 | 12:42 AM
యుద్ధం నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో చాలామంది ఎలక్ర్టిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలుకు జనం మొగ్గు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయం వైపు చూపు
ఇటీవల మరీ డిమాండ్
డెలివరీకి 30 రోజులు సమయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
యుద్ధం నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో చాలామంది ఎలక్ర్టిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడం, క్యూలైన్లలో నిరీక్షించాల్సి రావడం, పైగా ఇంధన రేట్లు ఇంకా పెరిగిపోతాయని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తుండడంతో జనం విద్యుత్ వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. విశాఖ జిల్లాలో ఎక్కడికక్కడే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. వాహన విక్రయదారులు కూడా పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తీసుకొని ఎక్స్ఛేంజ్ కింద ఎలక్ర్టిక్ కార్లు, టూ వీలర్లు ఇస్తున్నారు. పైగా వాయిదాల పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దాంతో వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.
నగరాల్లో వాహన కాలుష్యం తగ్గించడానికి ఎలక్ర్టిక్ వాహనాలపై దృష్టిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2017 నుంచే ప్రచారం ప్రారంభించి ప్రోత్సహిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ సహా పలువురికి ఈ-కార్లను అందజేశాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో కూడా అధికారులు ఈ-కార్లను చాలా కాలంగా వాడుతున్నారు. విశాఖ సిటీలో అయితే ఈ-వాహనాలు అద్దెకు కూడా లభిస్తున్నాయి.
ఇవీ గణాంకాలు
విశాఖ జిల్లాలో 2017 నుంచి ఈ-వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నాటి నుంచి 2024 డిసెంబరు వరకు చాలా మందకొడిగా వాటి విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖపట్నం ఆర్‌టీఓ కార్యాలయ సమాచారం ప్రకారం 2024 డిసెంబరు నాటికి జిల్లాలో 720 ఎలక్ర్టిక్ కార్లు, 5,704 టూ వీలర్స్ మాత్రమే ఉన్నాయి. వీటిపై అవగాహన పెరగడం, కంపెనీలు కూడా ఉత్పత్తి పెంచడం, విస్తృతంగా ప్రచారం చేయడం తదితర కారణాలతో 2025 జనవరి నుంచి విక్రయాలు పెరుగుతూ వచ్చాయి. గత రెండు నెలల్లో కొనుగోళ్లు అఽధికమయ్యాయి. 2025 జనవరి నుంచి 2026 మే 20 తేదీ వరకు ఎలక్ర్టిక్ కార్లు 1,545, ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాలు 8,615 రిజిస్టర్ అయ్యాయి. అంటే పదిహేడు నెలల కాలంలో 10,160 ఈ-వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. వాటిలో 3,551 వాహనాలు గత నాలుగు నెలల్లోనే రిజిస్టర్ అయ్యాయని ఆర్‌టీఓ శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం జిల్లా రహదారులపై 26,257 ఎలక్ర్టిక్ వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో కొన్ని బస్సులు కూడా ఉండడం విశేషం.
పెరిగిన డిమాండ్
ముఖ్యంగా ఎలక్ర్టిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ పెరిగింది. బైక్‌కు ఒక ఉద్యోగి నెలకు సగటున రూ.3 వేల వరకు పెట్రోల్ కోసం వెచ్చించేవారు. ఇటీవల దాన్ని ఎక్స్ఛేంజ్‌లో ఇచ్చి ఎలక్ర్టిక్ స్కూటర్ తీసుకున్నారు. చార్జింగ్‌కు నెలకు వేయి రూపాయలలోపు అవుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనం మార్చాలనే ఆలోచన ఉన్నవారు ఎలక్ర్టిక్ స్కూటర్‌కు వెళ్లిపోతున్నారు. మే ఒకటో తేదీ వరకు ఉదయం షోరూమ్‌కు వెళితే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేసేవారు. ఇప్పుడు రెండు నుంచి మూడు వారాలు ఆగాలని, ముందుగా బుక్ చేసుకోవాలని డీలర్లు చెబుతున్నారు.
ఇక కార్ల విషయానికి వస్తే పెరుగుతున్న డిమాండ్‌ను చూసి ధరలు పెంచుతామని రెండు రోజుల క్రితమే కొన్ని సంస్థలు వెల్లడించాయి. నెలాఖరులోగా బుక్ చేసుకొని డబ్బులు కడితే ప్రస్తుత ధరకే ఇస్తామని, జూన్ వచ్చిందంటే కనీసం రూ.30 వేలు పెరుగుతుందని డీలర్లు చెబుతున్నారు. ఒక సంస్థ అయితే ఎలక్ర్టిక్ కారు కొంటే ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవడానికి అవసరమైన ఎక్విప్‌మెంట్ (రూ.50 వేలు విలువ) ఉచితంగా ఇస్తోంది. ఇనస్టాలేషన్ ఉచితంగా చేస్తోంది. మొదటి వేయి యూనిట్ల వరకు ఉచిత చార్జింగ్ సౌకర్యం అందిస్తోంది. దీని విలువ రూ.20 వేలు ఉంటుందని మారుతీ కార్ల షోరూమ్ ప్రతినిధి వెంకట్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎలక్ర్టిక్ స్కూటర్లకు కూడా ఉచిత చార్జింగ్ సౌకర్యం కల్పిస్తామని కొన్ని సంస్థలు చెబుతున్నా...ఆయా పాయింట్లకు వెళితే డబ్బులు అడుగుతున్నారని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడం విశేషం.