Share News

అవినీతికి కేరాఫ్‌

ABN , Publish Date - May 12 , 2026 | 01:35 AM

స్థానిక తహశీల్దారు కార్యాలయంపై అవినీతి ముద్ర బలంగా పడుతున్నది.

అవినీతికి కేరాఫ్‌

నక్కపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో లంచం ఇస్తేనే పనులు

ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లు

హోం మంత్రి హెచ్చరికలు సైతం బేఖాతరు

ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు

తాజాగా మ్యుటేషన్‌ కోసం రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

ఏడాది క్రితం ఆర్‌ఐ...

నక్కపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి):

స్థానిక తహశీల్దారు కార్యాలయంపై అవినీతి ముద్ర బలంగా పడుతున్నది. డబ్బులు తీసుకోకుండా ఏ ఒక్క పనీ చేయరన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ‘ రెవెన్యూ శాఖపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. పద్ధతి మార్చుకోండి. జవాబుదారీతనంగా వుంటూ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించండి’ అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి అయిన వంగలపూడి అనిత ఇటీవల హెచ్చరించారు. కానీ ఆమె మాటలను ఈ చెవిన విని, ఆ చెవిని వదిలేశారు రెవెన్యూ ఉద్యోగులు. మీరు (హోం మంత్రి) ఎన్ని చెప్పినా మా తీరు మారదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ రకాల ధ్రువపత్రాల జారీ, ఆన్‌లైన్‌లో పేర్లు మార్పులు, చేర్పులు, తదితర సేవలకు ప్రజలు నిర్ణీత మొత్తంలో రుసుము చెల్లిస్తున్నప్పటికీ.. అదనంగా డబ్బులు ఇవ్వనిదే అధికారులు, సిబ్బంది పనులు చేయడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో చేతులు తడిపితేనే దరఖాస్తులకు మోక్షం లభిస్తుంది. కాసులు ముట్టజెప్పకపోతే వారాలు, నెలల తరబడి పనులు కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మ్యుటేషన్‌ పనులు సిబ్బందికి ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. పొలం విస్తీర్ణం, మార్కెట్‌ విలువ, దరఖాస్తుదారుని ఆర్థిక పరిస్థితినిబట్టి రేటు నిర్ణయించారు. ఈ ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే ఎంత కాలమైనా మ్యుటేషన్‌ చేయరు. దీంతో విసుగెత్తిపోయిన పలువురు డబ్బులు ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేనివారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్రమ వసూళ్లు చేపట్టేది వీఆర్వోలే అయినప్పటికీ.. వీఆర్‌ఏ నుంచి తహశీల్దారు వరకు ఎవరి వాటాలు వారికి వెళతాయన్నది బహిరంగ రహస్యం. అవినీతి సొమ్ము అందరికీ చేరుతున్నప్పటికీ ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న వారిలో అత్యధికులు వీఆర్వోలు కావడం గమనార్హం.

రెవెన్యూ శాఖలో అవినీతిపై నక్కపల్లి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో పలువురు సభ్యులు నేరుగా ఆరోపణలు చేశారు. తహశీల్దారు కార్యాలయం దళారులకు అడ్డాగా మారిందని ఆరోపించడమేకాదు.. ఏకంగా ఆధారాలు సైతం చూపించారు. కానీ ఉన్నతాధికారులు చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. భూముల ఆన్‌లైన్‌, అడంగళ్లు, 1బీలో నమోదు, మ్యుటేషన్‌ వంటి పనులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగినంత లంచం ఇవ్వకపోతే.. కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు.

ఏడాది క్రితం ఆర్‌ఐ.. ఇప్పుడు వీఆర్వో...

వ్యవసాయ భూమిలో బోరు వేయడానికి అనుమతి కోసం 2025 మార్చి 29న అప్పటి ఆర్‌ఐ కన్నబాబు ఓ రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తరువాత కొద్ది రోజులపాటు లంచాల మాటత్తెలేదు. తరువాత మళ్లీ మామూలే! తాజాగా సోమవారం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు ఒక రైతు నుంచి రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఇంత భారీ మొత్తంలో లంచం డిమాండ్‌ చేయడం, అందునా ఏసీబీ అధికారులకు పట్టుబడడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. ఈ సంఘటన రెవెన్యూ వర్గాలు కలకలం రేపింది.

Updated Date - May 12 , 2026 | 01:35 AM