Share News

ఆగని కబ్జా పర్వం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:34 AM

ఆరిలోవ ప్రాంతంలోని శ్రీకృష్ణాపురం వద్ద గల ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 26, 27లో భూములు మొత్తం ప్రభుత్వానికి చెందినవే అయినా స్థానికులు కొందరు కబ్జాకు పాల్పడుతున్నారు. ఎవరైనా నిలదీస్తే బెదిరిస్తున్నారు.

ఆగని కబ్జా పర్వం

ప్రభుత్వ భూముల్లో పాగా

శ్రీకృష్ణాపురంలో నీటిమడుగులు

ఉన్న 900 ఎకరాలు చాలాకాలం కిందట

జీవీఎంసీకి కేటాయింపు

ఇప్పుడా భూముల ఆక్రమణ

చోద్యం చూస్తున్న నగర పాలక సంస్థ అధికారులు

విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి):

ఆరిలోవ ప్రాంతంలోని శ్రీకృష్ణాపురం వద్ద గల ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 26, 27లో భూములు మొత్తం ప్రభుత్వానికి చెందినవే అయినా స్థానికులు కొందరు కబ్జాకు పాల్పడుతున్నారు. ఎవరైనా నిలదీస్తే బెదిరిస్తున్నారు.

ముడసర్లోవ సర్వే నంబర్లు 26, 27లో సుమారు 900 ఎకరాలు నీటి మడుగులుండే భూములు. వీటిని జీవీఎంసీకి కేటాయించారు. అయితే 1977లో పాడేరు ఐటీడీఏ పీవో సిఫారసు మేరకు స్థానికంగా చాలాకాలం నుంచి ఉన్న గిరిజనులకు 64 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర వర్గాలకు మరో 90 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన అనేక మంది సొంత అవసరాలకు స్థలాలు అమ్ముకున్నారు. వారిలో అనేకమంది కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తమకు కేటాయించిన భూములను ఇతరులకు పట్టాలు ఇచ్చిన విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాశారు. నీటి మడుగులుండే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన పట్టాలను అప్పటి కలెక్టర్‌ రద్దు చేసి భూములను తిరిగి జీవీఎంసీకి అప్పగించారు. దీంతో సర్వే నంబర్లు 26, 27లో ఉన్న భూములు రక్షించుకునే బాధ్యత నగర పాలక సంస్థదే అయినప్పటికీ, అనేక రకాల ఒత్తిళ్లతో మెతక వైఖరి ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. కొందరు చిన్నపాటి నిర్మాణాలు చేసి తప్పుడు సర్వేనంబర్లతో విక్రయించేశారు. మరికొందరు ఇంకా ఆక్రమణలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆక్రమణలపై స్థానికులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విశాఖ రూరల్‌ తహశీల్దారు కార్యాలయ అధికారులను సంప్రతించగా, సర్వేనంబరు 26, 27లో భూముల్లో చాలాకాలం క్రితమే పట్టాలు రద్దు చేసి, ఆ భూములను జీవీఎంసీకి అప్పగించామన్నారు. వాటిని రక్షించుకునే బాధ్యత జీవీఎంసీదేనని పేర్కొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:34 AM