Share News

ఆగని కబ్జా పర్వం

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:15 AM

ఆరిలోవ ప్రాంతంలోని శ్రీకృష్ణాపురం ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ముడసర్లోవలో సర్వేనంబరు 26,27లో భూములు మొత్తం ప్రభుత్వానికి చెందినవే అయినా స్థానికులు కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా నిలదీస్తే బెదిరిస్తున్నారు.

ఆగని కబ్జా పర్వం

శ్రీకృష్ణాపురం కబ్జాల వెనుక కీలకవ్యక్తులు?

ఏళ్ల క్రితమే పట్టాలు రద్దుచేశామన్న అధికారులు

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):

ఆరిలోవ ప్రాంతంలోని శ్రీకృష్ణాపురం ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ముడసర్లోవలో సర్వేనంబరు 26,27లో భూములు మొత్తం ప్రభుత్వానికి చెందినవే అయినా స్థానికులు కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా నిలదీస్తే బెదిరిస్తున్నారు.

ముడసర్లోవ సర్వేనంబరు 26, 27లో సుమారు 900 ఎకరాలు నీటి మడుగులుండే ప్రాంతం. ఈ భూములు మొత్తం జీవీఎంసీకి కేటాయించారు. అయితే 1977లో పాడేరు ఐటీడీఏ పీవో సిఫారసు మేరకు స్థానికంగా చాలాకాలం నుంచి ఉన్న గిరిజనులకు 64 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర వర్గాలకు మరో 90 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన అనేక మంది సొంత అవసరాలకు స్థలాలు అమ్ముకున్నారు. వీరిలో అనేకమంది కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తమకు కేటాయించిన భూములను ఇతరులకు పట్టాలు ఇచ్చిన విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై జీవీఎంసీ అధికారులు చాలాకాలం క్రితం సర్వేచేశారు. నీటి మడుగులుండే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

దీని ప్రకారం గతంలో ఇచ్చిన పట్టాలను అప్పటి కలెక్టర్‌ రద్దుచేసి భూములను తిరిగి జీవీఎంసీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో సర్వేనంబరు 26,27లో ఉన్న భూములు రక్షించుకునే బాధ్యత జీవీఎంసీదే అయినా అనేక రకాల ఒత్తిళ్లతో మెతక వైఖరి ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. కొందరు చిన్నపాటి నిర్మాణాలుచేసి తప్పుడు సర్వేనంబర్లతో విక్రయించేశారు. మరికొందరు ఇంకా ఆక్రమణలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆక్రమణలపై స్థానికులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై విశాఖ రూరల్‌ తహశీల్దారు కార్యాలయ అధికారులను సంప్రదించగా, సర్వేనంబరు 26,27లో భూముల్లో చాలాకాలం క్రితమే పట్టాలు రద్దుచేసి, ఆ భూములను జీవీఎంసీకి అప్పగించామన్నారు. వాటిని రక్షించుకునే బాధ్యత జీవీఎంసీదేనని పేర్కొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 01:15 AM