సొంతింటి కల సాకారం
ABN , Publish Date - May 10 , 2026 | 12:55 AM
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న పేదల కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో సుమారు 15 వేల ఇళ్లు అనకాపల్లి జిల్లాకు కేటాయిస్తారని అధికారవర్గాల సమాచారం. వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక జరగనున్నది.
పేదల గృహ నిర్మాణాలకు కదలిక
పీఎంఏవై కింద రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లు
జిల్లాకు 15 వేలు మంజూరయ్యే అవకాశం
సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం
వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న పేదల కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో సుమారు 15 వేల ఇళ్లు అనకాపల్లి జిల్లాకు కేటాయిస్తారని అధికారవర్గాల సమాచారం. వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక జరగనున్నది.
గత వైసీపీ ప్రభుత్వం పేదలకు స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించింది. పలుచోట్ల వేసిన లేఅవుట్ ప్రాంతాలు నివాసానికి యోగంగా లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాలేదు. మరికొంతమంది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చాలవంటూ ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేశారు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం తామే చేపడతామంటూ వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, లబ్ధిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారు. పునాదుల వరకు నిర్మాణం చేపట్టిన తరువాత గిట్టుబాటు కావడం లేదంటూ చేతులెత్తేశారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, సబ్బవరం మండలాల్లో అసంపూర్తి ఇళ్లు అధికంగా దర్శనమిస్తున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొనేందుకు గత ఏడాది ఎస్సీ, బీసీ అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున మంజూరు చేసింది. సుమారు రెండు వేల మంది అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రానికి 2.5 లక్షల గృహాలు మంజూరు చేసింది. ఇందులో అనకాపల్లి జిల్లాకు సుమారు 15 వేల ఇళ్లు కేటాయించే అవకాశం వుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమకు సొంత గూడు లేదని, ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 45,354 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలకు చెందిన వారు వున్నారు. అత్యల్పంగా కశింకోట, మునగపాక మండలాల నుంచి దరఖాస్తులు అందాయి. సొంత స్థలం ఉండి, ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇళ్లు మంజూరు చేయనున్నట్టు గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో పక్కా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపడతామని ఆయన చెప్పారు.