Share News

సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:33 AM

జీవీఎంసీ పరిధిలోని 30 లేఅవుట్‌లలో నిర్మించిన 3,600 టిడ్కో ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.

సొంతింటి కల సాకారం

3,600 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగింత

రూ.318.03 కోట్ల వ్యయం

జీవీఎంసీ పరిధిలో మొత్తం 30 20,264 ఇళ్లు

జూన్‌ కల్లా మిగిలిన ఇళ్లు అప్పగింత

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలోని 30 లేఅవుట్‌లలో నిర్మించిన 3,600 టిడ్కో ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. రూ.318.03 కోట్లతో ఈ ఇళ్లను మంత్రిపాలెం, తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ, కొమ్మాదిలో నిర్మించారు. తలారివానిపాలెంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొని లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. మంత్రిపాలెంలో లబ్ధిదారులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కొమ్మాదిలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు లబ్ధిదారులకు తాళాలు అందజేశారు.

గతం (2014-19)లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 40 వేలకుపైగా టిడ్కో ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించి ఆ మేరకు 30 లేఅవుట్‌లలో 25 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. సగానికిపైగా ఇళ్ల నిర్మాణాలను దాదాపు పూర్తిచేశారు. ఆ సమయంలో ఎన్నికలు (2019) వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చూపారు. ముందుగా డిపాజిట్‌ చెల్లించిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరుచేశాయి. అయినా ఇళ్లు అందజేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే డిపాజిట్లు చెల్లించిన వారందరికీ కాకుండా వడపోత పేరిట లబ్ధిదారుల సంఖ్యను 20,264కు పరిమితం చేసింది. ఎన్నికల ముందు 4,424 ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం 3,600 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. వచ్చే నెలలో కొన్నింటిని, మిగిలిన ఇళ్లను జూన్‌లో అందజేస్తామని టిడ్కో ఈఈ సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 01:33 AM