Share News

పథకాల అమలులో జిల్లాకు ‘బి’ గ్రేడు

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:27 PM

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాకు ‘బి’ గ్రేడు దక్కింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల స్పందన, జిల్లాల ప్రగతిపై అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. వివిధ ప్రభుత్వ విభాగాధిపతులు కలెక్టర్లతో వర్చువల్‌గా సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

పథకాల అమలులో జిల్లాకు ‘బి’ గ్రేడు
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌

ప్రజల సంతృప్తిని పెంచాలని సీఎం చంద్రబాబు సూచన

పథకాలు, పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ఆదేశం

జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 62 శాతంగా నమోదు

ఐవీఆర్‌ఎస్‌, ఆర్‌టీజీఎస్‌ ద్వారా సేకరించిన వివరాల ద్వారా వెల్లడి

వీటిపై వైసీపీ ప్రభావం ఉండొచ్చని పలువురి అనుమానం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాకు ‘బి’ గ్రేడు దక్కింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల స్పందన, జిల్లాల ప్రగతిపై అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. వివిధ ప్రభుత్వ విభాగాధిపతులు కలెక్టర్లతో వర్చువల్‌గా సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ప్రకటించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 34 విభాగాల్లో 68 పాయింట్లతో ‘బి’ గ్రేడులో, పారిశ్రామిక రంగంలో 10 విభాగాల్లో 60 పాయింట్లతో ‘బి’ గ్రేడు, సర్వీస్‌ సెక్టార్‌లో 7 విభాగాల్లో 73 పాయింట్లతో ‘బి’ గ్రేడు సాధించగా, పెర్ఫార్మన్స్‌, అచీవ్‌మెంట్‌లో మాత్రం 91.61 శాతం పొందింది.

జిల్లాలో ప్రజల సంతృప్తి 62 శాతం

జిల్లాలో ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమంలో ప్రజల నుంచి సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 62 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని గుర్తించారు. అలాగే వివిధ సేవలను పరిశీలిస్తే... రవాణా సేవల్లో 52 శాతం, బీసీ వెల్ఫేర్‌లో 64.3, పాఠశాల విద్యలో 78.1, కళాశాల విద్యలో 68.0, మహిళా శిశు సంక్షేమ సేవల్లో 73,9, గర్భిణులకు వైద్య సేవలు 69.0, టూరిజంలో 57.4, పట్టాదారుపాసు పుస్తకాల పంపిణీలో 73.4 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌, ఆర్‌టీజీఎస్‌ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం గుర్తించింది.

ఐవీఆర్‌ఎస్‌పై జిల్లాలో వైసీపీ ప్రభావం

కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్‌ను వినియోగిస్తున్నారు. అయితే జిల్లాలో అనేక ప్రాంతాలకు మొబైల్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో పాటు దానిపై వైసీపీ ప్రభావం అధికంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రజలకు ప్రభుత్వ సేవలు బాగానే అందుతున్నప్పటికీ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన సమాచారంలో మాత్రం సక్రమంగా సేవలు అందడం లేదనే గణాంకాలు నమోదవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని వార్డు సభ్యుడు మొదలుకుని సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యుని వరకు అందరూ వైసీపీకి చెందిన వాళ్లే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులు, వారి శ్రేణులే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? అనే ప్రశ్నకు కచ్చితంగా లేరనే సమాధానమే చెబుతారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం ద్వారా చక్కని సేవలందుతున్నప్పటికీ, ప్రజల సంతృప్తి స్థాయి బాగానే ఉన్నా ఐవీఆర్‌ఎస్‌లో మాత్రం సంతృప్తి స్థాయి బాగాలేదనే తేలుతున్నది. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించక పోవడంతో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన సమాచారంపై మాత్రమే ఆధారపడి జిల్లాలో ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని నిర్ధారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 12 , 2026 | 11:27 PM