గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:15 AM
గోదావరి జలాల రాకతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
తాళ్లపాలెం వద్ద జలహారతి
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాల రాకతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు రావడంతో శనివారం జలాలకు పసుపు, కుంకుమలు, వస్త్రాలు సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు జిల్లాకు చేరడం ఎంతో ఆనందకరమైన, చారిత్రాత్మకమైన విషయమన్నారు. తొలిదశలో జిల్లాలో సుమారు 46 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాళ్లపాలెం పరిసర ప్రాంతాల్లోని చెరువులకు లిఫ్ట్‌ల ద్వారా గోదావరి జలాలను అందించి రైతులకు ప్రయోజనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గోదావరి జలాలను ఏలేరు కాలువతో అనుసంధానం చేయడం వలన విశాఖపట్నం సాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు పరిశ్రమలకు నీటి సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.