జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:49 AM
కేంద్రం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు అనకాపల్లి జిల్లాలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రత్యేక దృష్టి సారించాయని రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత అన్నారు.
పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
మంత్రులు అనగాని, కొల్లు రవీంద్ర, అనిత
నక్కపల్లి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
కేంద్రం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు అనకాపల్లి జిల్లాలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రత్యేక దృష్టి సారించాయని రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత అన్నారు. వీరు సోమవారం నక్కపల్లి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నక్కపల్లిలో నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫొటోను ముద్రించి, రైతులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. దీంతో కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని, కొత్తగా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2029నాటికి అనేక పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ల్యక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడానికి అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం పాయకరావుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు హోం మంత్రి అనిత సమకూర్చిన సైకిళ్లను పంపిణీ చేశారు. అంతకుముందు ఉపమాక హైవే జంక్షన్ నుంచి నక్కపల్లి హైస్కూల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, కూటమి నాయకులు ఏజెర్ల వినోద్‌రాజు, అమలకంటి అబద్దం, చించలపు పద్దు, కురందాసు నూకరాజు, దేవర సత్యనారాయణ, గింజాల లక్ష్మణరావు, వైబోయిన రమణ , విలయం కేరీ, తదితరులు పాల్గొన్నారు.
కాగా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఆర్డీవీ వీవీ రమణ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
రైతుల కోసమే ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
మంత్రులు రవీంద్ర, అనితలతో కలిసి అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం నూతన భవనం ప్రారంభం
కొత్తూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) :
గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్టును తీసుకువచ్చి రైతులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిందని, దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనకాపల్లి మండలం కొత్తూరులో నిర్మించిన ఆర్డీవో కార్యాలయం నూతన భవనాన్ని సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనితలతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు తలెత్తకుండా వుండేలా రీసర్వే 2.0ను తీసుకువచ్చామన్నారు. సర్వే నిర్వహించే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రీసర్వే అనంతరం భూ యజమానుల ఇంటి వద్దకే వచ్చి పాసుపుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం వుండాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు అప్పట్లోనే భోగాపురం ప్రాంతంలో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దీనిని అడ్డుకోవడానికి అప్పుడు ప్రతిపక్షంలో వున్న వైసీపీ నేతలు.. కోర్టుల్లో కేసులు వేయించారని, భూములు ఇవ్వొద్దంటూ స్థానిక ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వ వచ్చినప్పటికీ నాలుగేళ్లపాటు విమానాశ్రయం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనుల్లో కదలిక వచ్చిందని, 18 నెలల్లోనే 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీఓ షేక్ ఆయీషా, డీఎస్పీ శ్రావణి, డీపీవో ఇ.సందీప్, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.