పోలింగ్ సామగ్రి పంపిణీ అత్యంత కీలకం
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:17 AM
జీవీఎంసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అన్నిరకాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేయాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అన్నిరకాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వెస్ట్ జోన్ పరిధిలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రత, ఇతర సౌకర్యాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సామగ్రి పంపిణీ అత్యంత కీలకమైన ప్రక్రియ కాబట్టి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. సామగ్రిని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా రూట్ మ్యాప్‌లు, ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ఫ్లెక్సీలను సిద్ధం చేసుకోవాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్లు ఎస్‌ఎస్‌వర్మ, రమేష్, తదితరులు ఉన్నారు.