సైబర్ కేటుగాళ్ల కనికట్టు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:49 AM
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకొక కొత్త ఫీచర్ వస్తోంది. ఏఐ వచ్చిన తరువాత ఏది నిజమో, ఏది కాదో...గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది.
ఏఐ వీడియోలతో మోసాలు
ప్రజా ప్రతినిధుల వీడియోల మార్ఫింగ్
సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారే లక్ష్యం
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు చెప్పి...
తాజాగా రేసపువానిపాలెం వాసికి టోకరా
సమస్య పరిష్కారానికి డబ్బులు అడిగితే అనుమానించాలంటున్న పోలీసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకొక కొత్త ఫీచర్ వస్తోంది. ఏఐ వచ్చిన తరువాత ఏది నిజమో, ఏది కాదో...గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పుడు ఏఐను సైబర్ నేరగాళ్లు కూడా అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి ప్రజలను దోచుకుంటున్నారు. నగరంలోని రేసపువానిపాలేనికి చెందిన శ్రీనివాసరెడ్డిని సైబర్ మోసగాళ్లు ఫేక్ వీడియోతో చీట్ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బ్యాంక్ అధికారులమని, పోలీసులమంటూ సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి అమాయకులను దోచుకునేవారు. ఆ తర్వాత కొరియర్, ఉద్యోగాలు, లాటరీలు, ట్రేడింగ్ పేరుతో మోసగించేవారు. వీటన్నింటిపై ప్రజలకు కొంతవరకు అవగాహన పెరిగింది. దీంతో సైబర్ మోసగాళ్లు ఫోన్‌లను ప్రజలు గుర్తించి రిజక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మోసపోతే పోలీసులు కేసు నమోదుచేసి చాలావరకు కొలిక్కితేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అస్త్రంగా మలచుకుంటున్నారు. ఏఐ సహకారంతో ప్రపంచంలో ఏ వ్యక్తినైనా కలిసినట్టు, మాట్లాడినట్టు వీడియో, ఫొటో మార్ఫింగ్, వాయిస్ మాడ్యుల్ చేయడం చాలా సులభమైపోయింది. సైబర్ నేరగాళ్లు సరిగ్గా దీనినే తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు తెగబడుతున్నారు. సీతంపేటలోని ఒక పార్కును అభివృద్ధి చేయాలని కోరుతూ రేసపువానిపాలేనికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కొందరు ప్రజా ప్రతినిధులను ట్యాగ్ చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తరువాత నాలుగు రోజులకు గుర్తుతెలియని నంబర్ నుంచి శ్రీనివాసరెడ్డికి వాట్సాప్ కాల్ వచ్చింది. తన పేరు దేవినేని ఉమా (మాజీ మంత్రి) అని అవతలి వ్యక్తి చెప్పాడు. కాల్ వచ్చిన నంబర్ డీపీగా దేవినేని ఉమా ఫొటో ఉండడంతో నిజమేనని శ్రీనివాసరెడ్డి భావించారు. మంత్రి లోకేష్‌తోపాటు కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా పోస్టు పెట్టావని, దీనిపై మంత్రి లోకేష్‌తోపాటు సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అవుతున్నారని బెదిరించాడు. తాను ఎవరినీ కించపరిచలేదని కేవలం పార్కు అభివృద్ధి చేయాలనే పోస్ట్ చేశానని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. అవతి వ్యక్తి...స్వయగా సీఎం చంద్రబాబునాయుడే వీడియోకాల్ చేస్తారని చెప్పారు. ఏఐ సహకారంతో సీఎం మాట్లాడుతున్నట్టు వీడియో కాల్ శ్రీనివాసరెడ్డికి చేయించారు. అనంతరం దేవినేని ఉమాగా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి జీవీఎంసీ కమిషనర్‌కు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉందని, పేర్కొంటూ ఒక స్కానర్‌ను శ్రీనివాసరెడ్డికి పంపించాడు. నిజంగానే పార్కు అభివృద్ధికి నిధులు మంజూరవుతాయనే భావనతో రూ.80 వేలు శ్రీనివాసరెడ్డి చెల్లించారు. మరుసటిరోజు అదే నంబర్‌కు శ్రీనివాసరెడ్డి తిరిగి మాట్లాడేందుకు ప్రయత్నించగా, దేవినేని ఉమా డీపీని అవతలి వ్యక్తి తొలగించడంతో అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతవరకు పోలీస్ అధికారుల డీపీలు పెట్టి వాట్సాప్ చాటింగ్ ద్వారా మోసాలకు పాల్పడిన సైబర్ కేటుగాళ్లు...ఇప్పుడు ఈ ఏఐ సహాయంతో వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ చేసి మోసాలు ప్రారంభించడంతో మరెంతమంది బాధితులుగా మారుతారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏఐపై అవగాహన లేకపోతే ముప్పుతప్పదు
సైబర్‌క్రైమ్ సీఐ, కె.భవానీప్రసాద్
ఏఐతో జరిగే మోసాలపై ప్రజల్లో అవగాహన లేకపోతే వాటికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. తెలియని నంబర్ నుంచి గానీ కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి గానీ వీడియోకాల్స్, వాయిస్‌కాల్స్ వస్తే...లిఫ్ట్ చేయకూడదు. ఆ విధంగా మోసపోకుండా తప్పించుకోవచ్చు. సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు నేరుగా ప్రజలకు వీడియో కాల్స్ చేసి మాట్లాడతారంటే నిజమేనని నమ్మేయకూడదు. డబ్బులు ఇస్తే పనులు చేస్తామని చెబితే గుడ్డిగా నమ్మకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.