మందుల దుకాణాల మాయాజాలం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:55 AM
జిల్లాలో కొందరు మందుల దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా విక్రయాలు
కొన్నిచోట్ల గడువు తీరిన మందులు, మత్తు కలిగించే మందుల అమ్మకం
గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా అబార్షన్ కిట్ల విక్రయం
తనిఖీలను గాలికి వదిలేసిన ఔషధ నియంత్రణ విభాగం అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొందరు మందుల దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గడువు తీరిన, మత్తు కలిగించే మందులను విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో అబార్షన్ కిట్లు, వయాగ్రా వంటి మాత్రలను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు.
ఆకస్మిక తనిఖీలతో అక్రమాలకు చెక్ చెప్పాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది ఈగల్ టీమ్‌తో కలిసి ఔషధ నియంత్రణ విభాగం అధికారులు జిల్లాలోని అనేక మెడికల్ స్టోర్స్‌లో తనిఖీలు చేపట్టారు. గడువుతీరిన మందుల విక్రయం, ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మకాలు, మరికొన్నిచోట్ల మత్తు కలిగించే మందుల అమ్మకాలు సాగుతున్నాయని గుర్తించారు. ఇలాంటి తనిఖీలను తరచూ చేపట్టడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలు
నగర పరిధిలో అనేకచోట్ల మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రైల్వేస్టేషన్, జ్ఞానాపురం, వన్‌టౌన్, అల్లిపురం, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో ఈ తరహా మందుల అమ్మకాలు విరివిగా సాగుతున్నాయని చెబుతున్నారు. అత్యంత నమ్మకస్తులైన వారికి మాత్రమే వీటిని విక్రయిస్తుండగా, వారి ద్వారా మిగిలిన వారికి చేరుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రత్యేక నెట్‌వర్క్ ఉన్నట్టు చెబుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు.
కిట్ల విక్రయాలు
గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో అబార్షన్ కిట్లు యథేచ్ఛగా అమ్మేస్తున్నారని చెబుతున్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఈ కిట్లు కొనుగోలు చేసి వైద్యం చేస్తున్నారు. అలాగే చాలాచోట్ల ప్రిస్కిప్షన్ రిజిస్టర్లను నిర్వహించడం లేదు. గతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఫార్మాసిస్టులు లేకుండా మందులు విక్రయిస్తున్న దుకాణాలకు లెక్కే లేదని సమాచారం.
ఇదీ లెక్క..
ఉమ్మడి జిల్లాలో సుమారు 4,500 మందుల దుకాణాలు ఉన్నాయి. విశాఖ జిల్లా పరిధిలో మూడు వేలు, మిగిలినవి అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఉన్నాయి. నగరంలోని మెడికల్ స్టోర్స్‌లో మత్తు, గడువుతీరిన మందులు విక్రయాలు అధికంగా ఉండగా, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో అబార్షన్ కిట్లతో పాటు అత్యవసర వైద్యానికి వినియోగించే మందులను ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నారు. వీటిపై నిఘా ఉంచి తనిఖీలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో వీటికి అడ్డుకట్ట పడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.