ఈఎస్‌ఆర్ నమోదు గడువు పొడిగించాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:38 AM
ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈఎస్‌ఆర్ కార్యక్రమానికి గడువు పొడుగించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి డిమాండ్ చేశారు.
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయి డిమాండ్
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈఎస్‌ఆర్ కార్యక్రమానికి గడువు పొడుగించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ-సర్వీస్ రికార్డ్ నమోదుకు ఈ నెల 30వ తేదీ ఆఖరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిందని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంతవరకు ఈఎస్‌ఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోలేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంత వరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియలో తలమునకులై ఉన్నారని ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఈఎస్‌ఆర్ గడువును 30వ తేదీ వరకే విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అలాగే వేలాది మంది ఉపాధ్యాయులు ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్ష కోసం ఆగస్టు నెల అంతా ప్రిపేర్ అయ్యారని, అక్టోబరు లో మరొక స్పెషల్ టెట్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని, ఇటువంటి తరుణంలో ఉపాధ్యాయులు టెట్‌కు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఇటువంటి తరుణంలో సెప్టెంబరు చివరిలోగా ఈఎస్‌ఆర్ నమోదు చేసుకోవాలని గడువు విధించడం సరికాదన్నారు. ఈఎస్‌ఆర్ నమోదుకు మరింత సమయాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాధ్యక్షుడు పంపన బోయిన వెంకటరావు, సహ అధ్యక్షురాలు రొంగలి ఉమాదేవి, కోశాధికారి జోగా రాజేశ్, కార్యదర్శులు గేదెల శాంతిదేవి, ఉప్పాడ రాము, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.