Share News

అతి వేగంతో అనర్థాలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:44 AM

మన్యంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అతి వేగంగా వాహనాలను నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

అతి వేగంతో అనర్థాలు
పాడేరు- అరకులోయ హైవేలో హుకుంపేట మండలం గడుగుపల్లి సమీపంలో మంగళవారం ఉదయం పొలాల్లోకి దూసుకుపోయిన టూరిస్టుల కారు

ఏజెన్సీలో నిత్యం రోడ్డు ప్రమాదాలు

ముఖ్యంగా హైవేలో అదుపు తప్పుతున్న వాహనాలు

డ్రైవింగ్‌ నియమాలు పాటించని వాహనచోదకులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అతి వేగంగా వాహనాలను నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏజెన్సీలో పాడేరు- అరకులోయ జాతీయ ర హదారిలో హుకుంపేట మండలం గడుగుపల్లికి సమీపంలో మంగళవారం ఉదయం ఓ కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. అలాగే మంగళవారం మధ్యాహ్నం పాడేరు- పెదబయలు మెయిన్‌రోడ్డు ఈదులపుట్టు వద్ద ఆర్‌టీసీ బస్సును ఎదురుగా వేగంగా వచ్చి ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. అయితే గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మన్యంలో రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం చింతపల్లి మండలం పెంటపాడు వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న గిరిజనులపైకి ఓ కారు దూసుకుపోయిన ఘటనలో కొర్రా సుశీల అనే మహిళ మృతి చెందగా, మరో మహిళ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. సోమవారమే పెదబయలు మంలడం పురుగుడుపుట్టు మలుపు వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయాలపాలు కాగా, అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమదంలో విశాఖపట్నానికి చెందిన యువకుడు నామాల సతీశ్‌ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. అదే మండలంలో ఈ నెల 19న లుంగపర్తి వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడివలస గ్రామానికి చెందిన పి.లచ్చన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నెల 20న జిల్లా కేంద్రం శివారు కొత్తపాడేరులో ఓ ఆటో అదుపు తప్పిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ నెల 16న సీలేరు ఘాట్‌లోని ఐస్‌గెడ్డ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ నెల 13న హుకుంపేట శివారున ఓ టూరిస్టు కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఇలా నిత్యం ఏజెన్సీలో ఏదో ప్రాంతంలో బైక్‌లు, కార్లు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవన్నీ గత వారం రోజుల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు, పైగా వాటిలో సగం పోలీసు కేసులు నమోదుకానివి. ముఖ్యంగా డిసెంబరు నుంచి మార్చి నెల వరకు ఏజెన్సీలో అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు.

డ్రైవింగ్‌పై అవగాహన లేమి.. ఆపై అతివేగం

ఏజెన్సీలోని రోడ్డు మార్గాలపై వాహనాల నడిపే వారికి డ్రైవింగ్‌పై సంపూర్ణ అవగాహన లేకపోవడంతో పాటు అతివేగం ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. మైదాన ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ రోడ్డు బాగుండడంతో బైకులు, ఆటోలు, కార్లను సైతం అతి వేగంగా నడుపుతున్నారు. రోడ్డు ఎంత వెడల్పుగా ఉన్నప్పటికీ ఎదురెదురుగా వస్తున్న బైకులు సైతం ఢీకొనడం విశేషం. అలాగే ఆటోలు అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని మరీ వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. కార్లు నడిపే వారంతా యువకులు కావడంతో వేగంగా నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో పలుమార్లు వాళ్లు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రాణాలు పోయేందుకు కారణమతున్నారు. గత నెలలో హుకుంపేట రాళ్లగెడ్డ వంతెనను కారు ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. అదే మండలంలో కొట్నాపల్లిలో రోడ్డుపై నడుస్తున్న ఓ వృద్దుడిని ఓ టూరిస్టు బైక్‌ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన గతంలో చోటు చేసుకుంది. ప్రధానంగా డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా అతి వేగంగా వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటిని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు, రోడ్డు రవాణా శాఖ భద్రతా వారోత్సవాలు పేరిట మొక్కుబడిగా ప్రదర్శనలు చేపట్టడడం మినహా ఏజెన్సీలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డు, స్పీడ్‌ స్టాపర్లు ఏర్పాటు చేయడంతోపాటు నిత్యం డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. వాహనదారులు సైతం డ్రైవింగ్‌ నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:44 AM