ఆనకట్టలు అధ్వానం
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:30 AM
మండలంలోని పలు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే వరహా నది గ్రోయిన్లు అధ్వానంగా వున్నాయి.
ఆయకట్టుకు నీరు అందక రైతుల ఇక్కట్లు
పాడైపోయిన రెగ్యులేటింగ్ గేట్లు
ఆరు గ్రోయిన్లకుగాను రెండింటికే నిధులు మంజూరు
మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
ఎస్.రాయవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని పలు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే వరహా నది గ్రోయిన్లు అధ్వానంగా వున్నాయి. చాలా ఏళ్ల నుంచి మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో రాతిపేర్పులు ధ్వంసం అయ్యాయి. దీనివల్ల నదిలో నీటి ప్రవాహం వున్నప్పటికీ గ్రోయిన్ల నుంచి కాలువలకు నీరు సరిగా ప్రవహించని పరిస్థితి నెలకొంది. ఇక గ్రోయిన్ల నుంచి కాలువలకు నీరు ప్రవహించడానికి ఏర్పాటు చేసిన రెగ్యులేటింగ్ గేట్లు తుప్పు పట్టాయి.
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన వరహా నది గొలుగొండ, నర్సీపట్నం, కోటవురట్ల మండలాల మీదుగా ప్రవహించి ఎస్.రాయవరం మండలంలో సముద్రంలో కలుస్తుంది. మండల పరిధిలో వరహానదిపై రిజర్వాయర్ నిర్మించే వెసులుబాటు లేకపోవడంతో రైతుల సాగునీటి అవసరాల కోసం పెదగుమ్ములూరు, సోముదేవుపల్లి, పెనుగొల్లు, సర్వసిద్ది, లింగరాజుపాలెం, కొరుప్రోలు గ్రామాల వద్ద ఆరు గ్రోయిన్లు నిర్మించారు. పెదగుమ్ములూరు గ్రోయిన్ కింద 2,067 ఎకరాలు, కొరుప్రోలు గ్రోయిన్ కింద 1063 ఎకరాలు, సర్వసిద్ది గ్రోయిన్ కింద 351 ఎకరాలు, లింగరాజుపాలెం గ్రోయిన్ కింద 375 ఎకరాలు, పెనుగొల్లు గ్రోయిన్ కింద 1095 ఎకరాలు, సోముదేవుపల్లి (మూలపాలెం) గ్రోయిన్ కింద 840 ఎకరాల ఆయకట్టు వుంది. వీటిలో పెనుగొల్లు, పెదగుమ్ములూరు, సోముదేవుపల్లి గ్రోయిన్‌లు చాలా కాలం క్రితమే పూర్తిగా దెబ్బతిన్నాయి. కొరుప్రోలు గ్రోయిన్ పెద్దమదుం పాడైంది. లింగరాజుపాలెం, సర్వసిద్ది గ్రోయిన్‌లు సైతం మరమ్మతులకు గురయ్యాయి. దీంతో వందలాది ఎకరాలకు నీరు సక్రమంగా అందక ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు దెబ్బతిన్న గ్రోయిన్ల వద్ద రైతులు శ్రమదానంతో ఇసుక బస్తాలను అడ్డుగా వేసి, కాలువలకు నీటిని మళ్లించుకుంటున్నారు. భారీ వర్షాలు కురిసి, నదిలో వరద ఉధృతి పెరిగితే.. ఇసుక బస్తాలు కొట్టుకుపోయి సమస్య మళ్లీ మొదటికొస్తున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక పెనుగొల్లు గ్రోయిన్ పునర్నిర్మాణానికి మాత్రమే నిధులు మంజూరు చేసింది. కాగా సోముదేవుపల్లి వద్ద కోతకు గురైన వరహా నది గట్టు వద్ద రక్షణ గోడ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేయగా, ఇందులో భాగంగా వున్న అక్కడే ఉన్న గ్రోయిన్‌కు కూడా మరమ్మతులు చేస్తారు. కాగా ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన గ్రోయిన్ల మరమ్మతులకు నిధులు మంంజూరవ్వలేదు.
నిధుల కోసం ప్రతిపాదనలు
అమీనా భాను, ఏఈ, ఇరిగేషన్ శాఖ
మండల పరిధిలో వరహా నదిపై ఆరు గ్రోయిన్‌లు ఉన్నాయి. పెనుగొల్లు గ్రోయిన్ పునర్నిర్మాణానికి రూ.99 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి. సోముదేవుపల్లి వద్ద కోతకు గురైన వరహా నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. దీనిలో గ్రోయిన్‌ను కూడా నిర్మిస్తాం. ఇక పెదగుమ్ములూరు గ్రోయిన్‌కు రూ.80 లక్షలు, కొరుప్రోలు గ్రోయిన్‌తోపాటు పెద్దమదుం మరమ్మతుకు రూ.40 లక్షలు, మిగిలిన రెండు గ్రోయిన్‌ల మరమ్మతులకు రూ.40 , పెదఉప్పలం ఆనకట్ట నిర్మాణానికి రూ.80 లక్షలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.