దాహం కేకలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:18 AM
మండల కేంద్రంలో వేసవికి ముందే నీటి సమస్య ప్రారంభమైంది. సాయినగర్ ప్రజలకు 15 రోజులుగా మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది.
వేసవికి ముందే నీటి సమస్య
సాయినగర్ ప్రజలకు 15 రోజులుగా నీటి సరఫరా బంద్
ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం
పట్టించుకోని అధికారులు
చింతపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వేసవికి ముందే నీటి సమస్య ప్రారంభమైంది. సాయినగర్ ప్రజలకు 15 రోజులుగా మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీళ్ల కోసం స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. స్థానిక ప్రజలు పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు నీటి సమస్యపై మొరపెట్టుకున్నా స్పందించిన దాఖలాలు లేవు.
చింతపల్లి మేజర్ పంచాయతీలో సీపీడబ్ల్యూ పథకం ద్వారా పదేళ్లగా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ పథకం ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నది. ప్రతి ఏడాది ఈ పథకం నిర్వాహణ బాధ్యతలను టెండర్ ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్‌కి అప్పగించి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నది. అలాగే తాజాగా నెల రోజుల క్రితం సాయినగర్ ప్రజల కోసం రూ.10 లక్షల జడ్పీ నిధులతో మంచినీటి పథకం నిర్మించి కొళాయిలు ఏర్పాటు చేశారు. సాయినగర్‌లో ఓ వీధి ప్రజలకు ఈ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అలాగే చింతపల్లి మేజర్ పంచాయతీలో 22 వీధుల ప్రజలకు ఈ సీపీడబ్ల్యూ పథకం ఒక్కటే ఆధారం. ఈ ఏడాది భూగర్భ జలాలు ముందుగానే అడుగంటిపోవడంతో సీపీడబ్ల్యూ పథకం ద్వారా మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతున్నది. సాయినగర్ ప్రజలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా బాలికల ఆశ్రమ పాఠశాల వెనుకనున్న ప్రజలకు నీటి సమస్య అధికంగా వున్నది. ఈ వీధిలో ఉన్న 300 కుటుంబాల ప్రజలు సుమారు మూడు మైళ్ల దూరంలోఉన్న పెద్దపైపు, చిన్నగెడ్డ ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొంత మంది 500 లీటర్ల నీటిని రూ.వెయ్యి చెల్లించి ప్రైవేటు వాహనాల్లో తెప్పించుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆదివాసీ దంపతులు నీళ్లు తెచ్చుకునే ఓపిక లేక, వాహనాల్లో నీళ్లు తెప్పించుకునే ఆర్థిక పరిస్థితి లేక నరకయాతన అనుభవిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
సాయినగర్‌కి 15 రోజులుగా నీటి సరఫరా జరగడంలేదని స్థానిక మహిళలు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి కనీసం సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నీటి సమస్యను పరిష్కరించాల్సిన ఇంజనీరింగ్, పంచాయతీ, మండల పరిషత్ అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి ప్రారంభం నుంచి పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం
చింతపల్లి ప్రజలకు ప్రతి ఏడాది వేసవిలో నీటి సమస్య తీవ్రమవుతున్నది. వేసవిలో నీటి సమస్య ప్రారంభమైన సమయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు హడావిడి చేయడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చింతపల్లికి పొరుగు గ్రామాల నుంచి నీటి సరఫరా చేసేందుకు గత ఏడాది ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అలాగే కుమ్మరివలస గ్రామం నుంచి జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా నీటిని చింతపల్లికి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం గత ఏడాది రూ.22 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ పనులు ఇప్పటికి ప్రారంభంకాలేదు. దీంతో ప్రతి ఏడాది వేసవిలో చింతపల్లి ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.