నకిలీ కరెన్సీ వ్యాపారమే ప్రాణాలు తీసింది
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:02 AM
నలుగురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం ఒక వ్యక్తి హత్యకు దారితీసింది.
ఎలమంచిలి వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
తీవ్రంగా కొట్టడంతో మృతి
మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసిన నిందితులు
ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
పరారీలో మరో నలుగురు నిందితులు
పది రోజులైనా ఆచూకీ లభించని మృతదేహం
ఎలమంచిలి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
నలుగురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. సుమారు పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హత్యకు గురైన వ్యక్తి ఎలమంచిలి పట్టణ వాసికాగా, హత్య జరిగిన ప్రదేశం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వుంది. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పరవాడ డీఎస్పీ మోహనరావు మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.
ఎలమంచిలి పాత ఎస్‌బీఐ కాలనీకి చెందిన కర్రి వర ప్రకాశరావు (49) సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు/ అమ్మకాలు చేస్తుంటాడు. మరోవైపు గాజువాకకు చెందిన జగదీశ్, కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామానికి చెందిన కుడుపూడి రామాంజనేయులు, అమలాపురానికి చెందిన కేదారశెట్టి విజయ గణేశ్‌లతో కలిసి నకిలీ కరెన్సీ మార్పిడి వ్యాపారం చేస్తుంటాడు. రామాంజనేయులు, విజయ గణేశ్ చాలా కాలంగా స్నేహితులు. కాగా రాజమహేంద్రవరానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి నకిలీ కరెన్సీని అమ్ముతుంటాడు. ఉదాహరణకు నిజమైన కరెన్సీ రూ.10 వేలు ఇస్తే.. అతను రూ.40 వేల నకిలీ కరెన్సీ ఇస్తుంటాడు. నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్న పై నలుగురిలో ప్రకాశరావుకు మాత్రమే రమేశ్‌తో పరిచయం వుంది. మిగిలిన ముగ్గురికి రమేశ్ ఎవరో తెలియదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సుమారు రూ.40 లక్షల నకిలీ కరెన్సీని కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం రూ.10 లక్షల నిజమైన కరెన్సీ అవసరమైంది. ఆ సమయానికి విజయ గణేశ్ మినహా మిగిలిన ముగ్గురి వద్ద డబ్బులు లేవు. ముందుగా గణేశ్ పెట్టుబడి పెడితే, నకిలీ కరెన్సీ కొనుగోలు చేసి, వాటిని మార్చడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లించడానికి మిగిలిన ముగ్గురు అంగీకరించారు. దీంతో రూ.10 లక్షల నిజమైన కరెన్సీని ప్రకాశరావుకు ఇచ్చారు. అతను రాజమహేంద్రవరంలో రమేశ్‌కు అ డబ్బులు ఇచ్చాడు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ లేదని, రెండు, మూడు రోజుల్లో ఇస్తానని అతను చెప్పాడు. కానీ రోజులు గడిచినా రమేశ్ నకిలీ కరెన్సీ ఇవ్వలేదు. దీంతో అందరి తరపున పెట్టుబడి పెట్టిన తనకు.. రూ.2.5 లక్షల చొప్పున తిరిగి ఇచ్చేయాలని విజయ గణేశ్ పట్టుబట్టాడు. నలుగురూ రాజమహేంద్రవరంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రకాశరావు ఈ నెల 16వ తేదీన జగదీశ్‌తోపాటు రాజమహేంద్రవరం వెళ్లాడు. రెండు, మూడు రోజులైనా ప్రకాశరావు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య కర్రి సత్య 20వ తేదీన పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రకాశరావుకు నకిలీ కరెన్సీ వ్యాపారంలో భాగస్వామి అయిన గాజువాకకు చెందిన జగదీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చెప్పిన ప్రకారం.. ప్రకాశరావు, జగదీశ్, విజయ గణేశ్, రామాంజనేయులు రాజమహేంద్రవరంలో కలుసుకున్నారు. అక్కడి నుంచి అందరూ కలిసి విజయ గణేశ్ బంధువైన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన చీమకుర్తి జగదీశ్ ఇంటికి వెళ్లారు. నకిలీ కరెన్సీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టిన విజయ గణేశ్... మిగిలిన ముగ్గురు రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో జగదీశ్ ఇంటి నుంచి రూ.2.5 లక్షలు రప్పించి, విజయ గణేశ్‌కు ఇచ్చేసి 17వ తేదీన తిరిగి వచ్చేశాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పడంతో పోలీసులు రెండు రోజుల క్రితం అమలాపురం వెళ్లి కేదారశెట్టి విజయగణేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను చెప్పిన వివరాల ప్రకారం.. ప్రకాశరావు డబ్బులు ఇవ్వకపోవడంతో మిగిలిన వారంతా కలిసి 18వ తేదీన అతనిని కారులో ఎక్కించుకొని కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడితిప్ప గ్రామ సమీపానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో ప్రకాశరావు మృతిచెందాడు. అదే కారులో రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చి, మృతదేహాన్ని గోదావరి నదిలోకి విసిరేశారు. ఎలమంచిలి పోలీసులు వెళ్లి గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రామాంజనేయులతోపాటు చీమకుర్తి జగదీశ్, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పరారీలో వున్నారు. విజయగణేశ్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసును అల్లవరం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును అక్కడి పోలీసులు చేపడతారని డీఎస్పీ వెల్లడించారు. మీడియా సమావేశంలో సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్‌ఐ సావిత్రి, ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.