కొలువుదీరిన కౌన్సిల్
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:34 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది.
ఇటీవల ఎన్నికైన జీవీఎంసీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ
జనసేనకు చెందిన 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ పేరును ప్రతిపాదించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
బలపరచిన ఎంపీ ఎం.శ్రీభరత్
ఏకగ్రీవంగా ఎన్నిక
నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కార్పొరేటర్లకు ఎంపీ, ఎమ్మెల్యేల పిలుపు
తండ్రి మృతి కారణంగా మేయర్ ముక్కా శ్రావణి, ఆమె సోదరి 49వ వార్డు కార్పొరేటర్ నీలవేణి గైర్హాజరు
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. కార్పొరేటర్లతో జిల్లా ఎన్నికల అథారిటీ హోదాలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ ముక్కా శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమెతోపాటు, 49వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆమె సోదరి నీలవేణి మినహా అందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మేయర్‌గా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి, కార్పొరేటర్లుగా టీడీపీ నుంచి 64 మంది, జనసేన నుంచి 26 మంది, బీజేపీ నుంచి ఎనిమిది మంది, వైసీపీ నుంచి 13 మంది, సీపీఎం నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఎనిమిది మంది ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికైన వారితో ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయించాలని, అదేరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అథారిటీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ కార్పొరేటర్లుగా ఎన్నికైన వారందరికీ జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపించారు.
జిల్లా ఎన్నికల అథారిటీ హోదాలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌కిషోర్ సోమవారం ఉదయం 11.45 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. సభ్యుల హాజరు పరిశీలించిన తర్వాత కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నియమ నిబంధనలను చదివి వినిపించారు. అనంతరం ప్రమాణ స్వీకార పత్రాలను సభ్యులకు అందజేసి ఒకేసారి అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, నియమ నిబంధనలను సభ్యులకు వివరించారు. తదనందరం డిప్యూటీ మేయర్ ఎన్నికకు నామినేషన్లు ఆహ్వానించారు. బీజేపీకి చెందిన ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు లేచి ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో డిప్యూటీ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ పేరును ప్రతిపాదించారు. ఎంపీ ఎం.శ్రీభరత్ లేచి శివప్రసాద్ పేరును బలపరుస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా ఎవరైనా నామినేషన్ దాఖలు చేయదలుచుకుంటే చెప్పాలని జిల్లా కలెక్టర్ కోరారు. సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు శివప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. ప్రత్యేక సమావేశాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించి జిల్లా కలెక్టర్ కౌన్సిల్‌హాల్ నుంచి వెళ్లిపోయారు.
ఆ తరువాత జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో జీవీఎంసీ దేశంలోనే (స్వచ్ఛసర్వేక్షన్ పోటీ) మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దీనికి గత పాలకవర్గంతోపాటు తమ అధికారులు, సిబ్బంది కృషి కారణమని వివరించారు. కొత్తపాలకవర్గం కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని నగర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మునిసిపల్ చట్టాలు, కార్పొరేటర్ విధులు, బాధ్యతలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఎన్నో ఆశలు, ఆశయాలతో కౌన్సిల్‌లో అడుగుపెట్టిన కార్పొరేటర్లు ఐదేళ్ల కాలంలో వాటన్నింటినీ సాధించి నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ కార్పొరేటర్ అనేది హోదా కాదని, ఒక బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు అధికారులతో సమన్వయం చేసుకుని నగరవాసులకు మంచి చేయాలని, నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకువెళుతోందని, జీవీఎంసీ పాలకవర్గం కూడా అదేరీతిలో పనిచేసి నగరవాసుల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎన్నికల పరిశీలకురాలు శోభిక, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా
డిప్యూటీ మేయర్ పీవీ శివప్రసాద్
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన పందిరి వెంకటశివప్రసాద్ అన్నారు. తనకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తోపాటు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం మేయర్, కమిషనర్‌తోపాటు ఇతర కార్పొరేటర్లను సమన్వయం చూసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని శివప్రసాద్ అన్నారు.