Share News

ప్రొటోకాల్‌ ఖర్చు తడిసిమోపెడు

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:15 AM

అతిథి మర్యాదల (ప్రొటోకాల్‌) ఖర్చులు జిల్లా అధికార యంత్రాంగం మోయలేనంత భారంగా మారాయి. ఖర్చుకు తగిన విధంగా బిల్లులు మంజూరుకాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గడచిన పదేళ్ల నుంచి అతిథి మర్యాదలు, ఈవెంట్ల నిర్వహణకు కోట్ల రూపాయలు వెచ్చించగా, నిధులు అరకొరగా విడుదల చేశారు. ప్రొటోకాల్‌, ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి సుమారు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.

ప్రొటోకాల్‌ ఖర్చు తడిసిమోపెడు

తలలు పట్టుకుంటున్న జిల్లా అధికారులు

మోయలేని భారంగా మారిందని ఆవేదన

ప్రతి నెలా రూ.లక్షల్లో వ్యయం

జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు

రూ.80 కోట్లకు చేరిన బకాయిలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అతిథి మర్యాదల (ప్రొటోకాల్‌) ఖర్చులు జిల్లా అధికార యంత్రాంగం మోయలేనంత భారంగా మారాయి. ఖర్చుకు తగిన విధంగా బిల్లులు మంజూరుకాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గడచిన పదేళ్ల నుంచి అతిథి మర్యాదలు, ఈవెంట్ల నిర్వహణకు కోట్ల రూపాయలు వెచ్చించగా, నిధులు అరకొరగా విడుదల చేశారు. ప్రొటోకాల్‌, ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి సుమారు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.

రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకు విశాఖ వేదికగా పలు ఈవెంట్లు జరిగాయి. వాటికి సంబంధించి ఇంకా రూ.12 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాం (2019-24)లో రూ.10 కోట్ల బకాయిలు ఉండిపోయాయి. నేవీ మిలాన్‌ (2022, 2024) నిర్వహణకు సంబంధించి రూ.మూడు కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర, పెట్టుబడుల సదస్సుకు సుమారు రూ.50 కోట్ల వరకూ ఇంకా విడుదల కావాలి. యోగాంధ్రకు తొలివిడత నిధులు విడుదల చేసిన కేంద్రం, మిగిలినవి ఇవ్వాల్సి ఉంది. ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సుకు వచ్చే అతిథులకు గదులు, వాహనాలు, ప్రాంగణం నిర్వహణ నిమిత్తం సీఐఐకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్ల వరకూ విడుదల చేసింది. అయితే జిల్లా ప్రొటోకాల్‌ విభాగం వెచ్చించిన సొమ్ములు విడుదల చేయలేదు.

ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తప్ప మిగిలిన ప్రముఖులంతా స్టార్‌ హోటళ్లలోనే బస చేస్తున్నారు. గతంలో సర్క్యూట్‌హౌస్‌, పోర్టు గెస్ట్‌ హౌస్‌, ఇతర అతిథి గృహాల్లో ప్రముఖులు బస చేసేవారు. అదో స్టేటస్‌ సింబల్‌గా చూసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్టార్‌ హోటళ్లలో బస చేసేందుకు ఇష్టపడుతున్నారు. హోటళ్లలో గదుల అద్దె, ఆహారం, వాహనాల వ్యయం ప్రొటోకాల్‌ విభాగం చూస్తోంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోడంతో హోటళ్ల నిర్వాహకులు కొన్నిసార్లు గదులు ఇవ్వడానికి ముందుకురావడం లేదు.

అలాగే నగరంలో జరిగే ఈవెంట్ల కోసం జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏతో పాటు రోడ్లు, భవనాలు, టూరిజం వంటి శాఖల ఆధ్వర్యంలో పనులు చేస్తుంటారు. బిల్లులు కలెక్టరేట్‌కు పంపారు. వాటిని ఆడిట్‌ విభాగం పరిశీలించి కొందరు సరఫరాదారులు చేసిన ఖర్చుకు మించి బిల్లులు పెట్టినట్టు గుర్తించి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎక్కువగా ఈవెంట్లు నిర్వహించిన ఒక వ్యక్తి బిల్లుల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించడంతో సవరించి బిల్లులు పెట్టాలని సూచించారు. ఇదిలావుండగా ఫిబ్రవరిలో మిలాన్‌, ఐఎఫ్‌ఆర్‌ ఈవెంట్లు ఉన్నాయి. రాష్ట్రపతితో పాటు అనేక దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. ఇందుకు భారీగా నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. నేవీ కార్యక్రమాలకు కనీసం రూ.10 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 01:15 AM