Share News

వంట నూనెలు సలసల!

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:33 AM

బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరల సలసల కాగుతున్నాయి.

వంట నూనెలు సలసల!

చాపకింద నీరులా పెరుగుతున్న ధరలు

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.167

వేరుశనగ నూనె రూ.180, పామాయిల్‌ రూ.120

పైపైకి పలు రకాల నిత్యావసర సరుకుల ధరలు

నర్సీపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరల సలసల కాగుతున్నాయి. కొన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. వంట నూనెలు నెల రోజుల్లోనే లీటరుకు ఇరవై రూపాయల మేర పెరిగింది. వేరుశనగ పలుకులు ఏకంగా కిలోకు యాభై రూపాయలు పెరిగాయి. రబీ పంటలు చేతికి వచ్చే వరకు ధరలు పెరిగే అవకాశం వుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.

నర్సీపట్నం వ్యాపార కూడలి కావడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు రాజమండ్రి, తుని, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి సరకునలు దిగుమతి చేసుకుంటారు. అదే విధంగా నర్సీపట్నం చుట్టు పక్కల వున్న ఏడెనిమిది మండలాల వ్యాపారులు ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అదే విధంగా పలు మండలాల ప్రజలు నెల లేదా రెండు నెలలకు ఒకసారి ఇక్కడకు వచ్చి ఇంటిల్లిపాదికీ అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తుంటారు. కాగా వంట నూనెలు, పలురకాల పప్పుల ధరలు కొద్ది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. జనవరిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.150 వుండగా, ఈ నెల ఆరంభంలో రూ.167లకు విక్రయిస్తున్నారు. వేరుశనగ నూనె రూ.160 నుంచి రూ.180కి పెరిగింది. పామాయిల్‌ ప్యాకెట్‌ (850 గ్రాములు) సైతం రూ.110 నుంచి రూ.120కి చేరింది. కంపెనీలను బట్టి లీటరుకు ఐదు రూపాయలు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ధరల మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. వినియోగదారులు సహజంగానే నూనె ప్యాకెట్‌ ధర చూస్తారే తప్ప, అందులో ఎంత పరిమాణంలో నూనె వుందన్నది గమనించరు. దీంతో పలు కంపెనీలు వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాములు ప్యాకెట్లను మార్కెట్‌లోకి దించాయి.

అనూహ్యంగా పెరిగిన వేరుశనగ పలుకుల ధర

వేరుశనగ పలుకుల ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.130 నుంచి రూ.140 వుండగా, ఇప్పుడు రూ.200కి విక్రయిస్తున్నారు. కంది పప్పు రూ.110 నుంచి రూ.130కి పెరిగింది. ఎండుమిర్చి వారం రోజుల క్రితం వరకు కిలో రూ.240 వుండగా ఇప్పుడు రూ.300లకు విక్రయిస్తున్నారు. మినపప్పు సైతం కిలోకు రూ.20 మేర పెరిగింది. పది రోజుల వ్యవధిలో వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చెప్పుకోదగ్గ పండుగలు లేకపోయినప్పటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదని అంటున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:33 AM