కొనసాగున్న చలి తీవ్రత
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:32 PM
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం కొయ్యూరుతో సహా అన్ని మండలాల్లోనూ సింగిల్ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయ 4.3 డిగ్రీలు
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
పాడేరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం కొయ్యూరుతో సహా అన్ని మండలాల్లోనూ సింగిల్ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కన్పించని విధంగా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తుండగా, జనం చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అయితే పర్యాటకులు కనువిందు చేసేలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులు క్రమంగా పెరుగుతున్నారు.
సింగిల్ డిజిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
శీతల వాతావరణం నేపథ్యంలో ఏజెన్సీలో కొయ్యూరుతో సహా అన్ని మండలాల్లోనూ శుక్రవారం సింగిల్ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయలో 4.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ముంచంగిపుట్టులో 4.4, జి.మాడుగులలో 4.7, పాడేరులో 5.0, చింతపల్లిలో 5.1, పెదబయలు, హుకుంపేటలో 5.2, కొయ్యూరులో 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల మండలాన్ని మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన కొద్ది రోజుల నుంచి దట్టంగా పొగ మంచు కురుస్తోంది. మంచుతో పాటు చలి తీవ్రత అధికంగా ఉంది. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం మినహా మిగిలి సమయమంతా చలి ప్రభావం అధికంగా నెలకొంది. ఉదయం సమయంలో ప్రయాణాలకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయ పనుల సైతం అడ్డంకిగా మారింది.